Telugu Global
Andhra Pradesh

రాజమండ్రి జైలు నాయుడు..

పాపి చిరాయువు అంటారని, అందుకే అలిపిరి దాడిలో చంద్రబాబు బతికి బయటపడ్డారని, ఇప్పుడు జైలుకెళ్లారని సెటైర్లు పేల్చారు రోజా. చంద్రబాబు ఈ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది అని విమర్శించారు.

రాజమండ్రి జైలు నాయుడు..
X

జగన్ ని జైలురెడ్డి అంటూ టీడీపీ నేతలు వెటకారం చేస్తుంటారని, ఇప్పుడు చంద్రబాబుని రాజమండ్రి జైలు నాయుడు అనాలా అని కౌంటర్ ఇచ్చారు మంత్రి రోజా. చంద్రబాబుని అవినీతి సైకో అని తాము కూడా అనగలం అన్నారు. దత్తపుత్రుడు నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. త్వరలో లోకేష్, అచ్చెన్నాయుడు కూడా అరెస్ట్ అవుతారంటూ జోస్యం చెప్పారు రోజా.

బందా, నా బొందా..!

ఏపీలో టీడీపీ చేపట్టిన బంద్ కి అసలు స్పందనే లేదన్నారు మంత్రి రోజా. బందా, నా బొందా అని టీడీపీ వాళ్లే అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓటుకి కోట్లు కేసులో చంద్రబాబు హైదరాబాద్ వదిలి పారిపోయి వచ్చిన రోజు కూడా టీడీపీ బంద్ చేసి ఉండాల్సిందన్నారామె. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చాలా స్కిల్ తో చంద్రబాబు దోచేశారని అన్నారు. అమరావతిలో భూముల్ని దోచుకున్నారని, పోలవరం, పట్టిసీమలో కూడా అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. ఇలాంటి అవినీతి పరుడ్ని గెలిపించామా అని కుప్పం ప్రజలు ఈరోజు బాధ పడుతున్నారన్నారు.

పాపి చిరాయువు..

పాపి చిరాయువు అంటారని, అందుకే అలిపిరి దాడిలో చంద్రబాబు బతికి బయటపడ్డారని, ఇప్పుడు జైలుకెళ్లారని సెటైర్లు పేల్చారు రోజా. చంద్రబాబు అరెస్ట్ ను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు ఈ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది అని విమర్శించారు. ఆయన బోగస్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. ఆయన కడిగిన ముత్యం కాదని, అవినీతి బురదలో కూరుకుపోయిన ముత్యం అని అన్నారు. వైసీపీ కక్ష సాధించాలనుకుంటే.. 2021 లోనే ఈ కేసు టేకప్ చేసిన రోజే జైలులో వేసేవాళ్లం అని చెప్పారు రోజా.

ఐటీ నోటీసులు వాస్తవం కాదా..?

చంద్రబాబుకి ఐటీ శాఖ నోటీసులివ్వడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు మంత్రి రోజా. ఆయన పీఏకి, లోకేష్ పీఏకి ఆ వ్యవహారంలో సంబంధం లేదా అని అడిగారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేశారని, ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారన్నారు. పట్టిసీమ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో కూడా చంద్రబాబు అరెస్ట్ అవుతారన్నారు.

పవన్ అప్పుడు దొర్లలేదే..

చిరంజీవిని ఎయిర్ పోర్ట్ లో అడ్డుకున్నప్పుడు పవన్ రోడ్లపై దొర్లలేదే అని ప్రశ్నించారు రోజా. షెల్ కంపెనీల్లో పవన్ కి కూడా పార్టనర్ షిప్ ఉందన్నారు. అందుకే ఆయన రోడ్లపై దొర్లుతున్నారని చెప్పారు. జైలులో చంద్రబాబుకు ప్రాణహాని లేదని, ఆయన వల్ల ఇతరులకు ప్రాణ హాని ఉందన్నారు. చంద్రబాబు అరెస్ట్ తో ప్రకృతి పులకించి పోయిందని, అందుకే జోరుగా వర్షం కురిసిందన్నారు రోజా.

First Published:  11 Sept 2023 9:04 AM GMT
Next Story