షర్మిల నాన్ లోకల్ పొలిటీషియన్
ఎంతమంది వచ్చినా జగన్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని, ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీకి అండగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.
షర్మిల నాన్ లోకల్ పొలిటీషియన్ అని మంత్రి రోజా అన్నారు. నగరి నియోజకవర్గంలోని వడమాలపేటలో స్విమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పింక్ బస్సు క్యాంపును మంత్రి రోజా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీపై ఆమె స్పందించారు.
షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడం అంటే.. మరో నాన్ లోకల్ పొలిటీషియన్ రాష్ట్రంలోకి వచ్చినట్లే.. అని రోజా సెటైర్ వేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చారని.. కాంగ్రెస్ పార్టీ జగన్ ను 16 నెలల పాటు జైల్లో పెట్టించిందని మంత్రి రోజా మండిపడ్డారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం ఏంటో అని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఓటు అడిగే హక్కు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. ఎంతమంది వచ్చినా జగన్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని, ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీకి అండగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల కోసం సీఎం జగన్ కష్టపడి పనిచేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ విద్య, వైద్యానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు.
తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని ఏర్పాటు చేసిన షర్మిల కొన్ని నెలలపాటు అక్కడ రాజకీయాలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. చివరికి ఆ పార్టీలో తన పార్టీని విలీనం చేసిన షర్మిల కాంగ్రెస్ తరఫున ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ తరఫున ప్రజల్లోకి వెళ్తున్న షర్మిల వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు కూడా షర్మిలకు కౌంటర్ గా విమర్శలు చేస్తున్నారు.