ప్రచారయావే ప్రాణాలు తీసింది.. చంద్రబాబుపై కేసుపెట్టాలి: రోజా
మృతి చెందిన ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయలు, గాయపడిన వారికి కోటి రూపాయలు చొప్పున టీడీపీ చెల్లించాలని రోజా డిమాండ్ చేశారు.
కందుకూరు ఘటనపై చంద్రబాబు నాయుడు టార్గెట్‌గా విమర్శలు మొదలయ్యాయి. తాజాగా మంత్రి రోజా ఈ ఘటనపై స్పందించారు. చంద్రబాబు నాయుడు ప్రచారయావ వల్లే 8 మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆరోపించారు.
ఈ ఘటనను కోర్టు సుమోటోగా స్వీకరించి చంద్రబాబుపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కందుకూరు ఘటన బాధాకరమని రోజా అన్నారు. ఇరుకైన ప్రదేశంలో సభను పెట్టి ఎక్కువ మంది ప్రజలు తన సభకు వచ్చినట్లు చూపించేందుకు చంద్రబాబు యత్నించాడని రోజా దుయ్యబట్టారు.
ఈ ఘటనలో చంద్రబాబుని ఏ-1ముద్దాయిగా చేర్చి హత్య కేసు పెట్టాలన్నారు. 8 మంది ప్రాణాలను బలిగొనడం చంద్రబాబు రాజకీయంగా చేసిన హత్య అని రోజా పేర్కొన్నారు.
మృతి చెందిన ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయలు, గాయపడిన వారికి కోటి రూపాయలు చొప్పున టీడీపీ చెల్లించాలని రోజా డిమాండ్ చేశారు. కందుకూరు ఘటనను టీడీపీ ఎంతగా కవర్ చేసుకోవాలని ప్రయత్నించినా విమర్శలు మాత్రం ఆగడం లేదు.
ఈ ఘటనపై స్వీయ తప్పిదాన్ని ఒప్పుకోవాల్సిన టీడీపీ నేతలు అధికార పార్టీపై ఎదురుదాడికి దిగడం గమనార్హం. టీడీపీ సభకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. మరోవైపు జనం తండోపతండాలుగా తరలిరావడం వల్లే ఈ ఘటన జరిగిందని సర్దిచెప్పుకుంటున్నారు.
నిజానికి ఇరుకుగా ఉన్న రోడ్లలో మీటింగ్ లు పెడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. సభకు ఎక్కువగా జనం వచ్చారని చూపించేందుకు గత కొన్ని రోజులుగా టీడీపీ ఇటువంటి ప్రయత్నమే చేస్తోంది. కర్నూలు, విజయనగరం జిల్లాల్లోనూ ఇరుకు రోడ్లనే టార్గెట్ చేసుకున్నది.
తాజాగా కందుకూరులోనూ ఇదే ప్రయత్నం చేయగా.. బెడిసి కొట్టింది. మరి చంద్రబాబు ఇక మీదట చేయబోయే మీటింగ్ లు ఇరుకు ప్లేస్ లలోనే పెడతారా? మరోచోట పెడతారా? అన్నది వేచి చూడాలి.