రోజా వైరి వర్గానికి అధిష్టానం షాక్
రోజాకు టికెట్ వచ్చిన తర్వాత కూడా ఆమె వ్యతిరేక వర్గం తమ ప్రయత్నాలను విరమించుకోలేదు. నేరుగా సీఎంఓ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు అసమ్మతి నేతలు.
జగనన్న ముద్దు - రోజా వద్దు అంటూ నిన్న మొన్నటి వరకు మంత్రి రోజాకు వ్యతిరేకంగా పనిచేసిన వర్గానికి వైసీపీ అధిష్టానం షాకిచ్చింది. వైరి వర్గం మాట వినేందుకు ఒప్పుకున్న పార్టీ పెద్దలు ఈ పంచాయితీలో మంత్రి రోజా కూడా ఉంటారని తేల్చి చెప్పారు. రోజాపై ఫిర్యాదు చేసేందుకు రెండు రోజులపాటు సీఎంఓ ముందు పడిగాపులు పడిన ఆమె వ్యతిరేక వర్గం ఈ నిర్ణయంతో షాక్ కి గురైంది. తిరుగు టపాలో నగరికి చేరుకుంది.
నగరి వైసీపీలో ఇటీవల కాలంలో మంత్రి రోజా వ్యతిరేక వర్గం బాగా యాక్టివ్ గా మారింది. ఆమెపై నేరుగా ఆరోపణలు చేయడం, ఆమెకు టికెట్ ఇస్తే ఓడిస్తామని చెప్పడం, మంత్రి పాల్గొనే కార్యక్రమాలను కూడా డిస్ట్రబ్ చేయడం ద్వారా అసమ్మతి నేతలు ఎల్లో మీడియాలో బాగా హైలైట్ అయ్యారు. తీరా ఎన్నికల సమయంలో రోజా టికెట్ కి ఎసరు పెట్టేందుకు వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జగనన్న ముద్దు - రోజా వద్దు అనే ప్రచారం చేపట్టారు. కొన్నాళ్లపాటు వీరిని భరిస్తూ వచ్చిన మంత్రి రోజా.. చివర్లో డైరెక్ట్ అటాక్ కి దిగారు. వ్యతిరేక వర్గంపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. వారికోసం తాను ఏమేం చేశాననే విషయాన్ని మీడియాకు చెప్పారు. మంత్రి రోజా భర్త సెల్వమణి కూడా వైరి వర్గానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే సీఎం జగన్ ఈ ఎపిసోడ్ ని పెద్దగా పట్టించుకోలేదు. రోజాకు ఆయన తిరిగి నగరి టికెట్ కన్ఫామ్ చేశారు. ఫైనల్ లిస్ట్ లో రోజా పేరు ఉండటంతో వైరి వర్గానికి షాక్ తగిలినట్టయింది.
రోజాకు టికెట్ వచ్చిన తర్వాత కూడా ఆమె వ్యతిరేక వర్గం తమ ప్రయత్నాలను విరమించుకోలేదు. నేరుగా సీఎంఓ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు అసమ్మతి నేతలు. ఆమెకు టికెట్ క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం వారికి షాకిచ్చింది. మంత్రి రోజా సమక్షంలోనే మాట్లాడదామని తేల్చి చెప్పారు పార్టీ పెద్దలు. అధిష్టానానికి చెప్పుకుందామని ఇక్కడి వరకు వస్తే, ఇక్కడ కూడా రోజా ముందు పంచాయితీ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నగరి అసమ్మతి నేతలు వెనక్కు వెళ్లిపోయారు.