అలా మాట్లాడాలంటే మగాడు భయపడేలా చేస్తా..
హత్య చేస్తే క్షణంలో ప్రాణం పోతుందని, కానీ నిందవేస్తే ఆ మహిళ జీవితాంతం అది మోయాల్సి వస్తుందని అన్నారు మంత్రి రోజా.
మహిళలను కించపరిచేలా మాట్లాడాలంటే మగాడు భయపడేలా తాము పోరాటం చేయాలనుకుంటున్నామని తెలిపారు మంత్రి రోజా. బండారు సత్యనారాయణ వ్యాఖ్యల్ని ఆమె మరోసారి తీవ్రంగా ఖండించారు. బండారుకి బెయిలొచ్చినంత మాత్రాన ఆయన చేసింది తప్పుకాకుండా పోదని, ఆయనపై పరువునష్టం కేసు దాఖలు చేస్తానని చెప్పారు. సుప్రీంకోర్టుకైనా వెళ్లి న్యాయపోరాటం చేస్తానన్నారు రోజా.
బండారు లాంటి చీడపురుగులను ఏరిపారేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి రోజా. మహిళలను కించపరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. చంద్రబాబు జైలుకెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కింది. టీడీపీ వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి తనను టార్గెట్ చేశారన్నారు రోజా. అసలు ఈ వ్యవహారంలో సంబంధం లేని జనసేన ఎందుకంతలా రియాక్ట్ అవుతోందని ప్రశ్నించారామె. టీడీపీ, జనసేన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ఆ నింద మోస్తూనే ఉండాలా..?
హత్య చేస్తే క్షణంలో ప్రాణం పోతుందని, కానీ నిందవేస్తే ఆ మహిళ జీవితాంతం అది మోస్తూనే ఉండాలా అని ప్రశ్నించారు మంత్రి రోజా. మాజీ మంత్రి అయిన బండారు నీచాతి నీచంగా మాట్లాడారని, తనకు తెలిసినంతవరకు ఓ మహిళ గురించి ఎవరూ ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేయలేదన్నారు. మహిళల పట్ల బండారుకు ఉన్న సంస్కారమేంటో ఆయన మాటల ద్వారా తెలుస్తోందని చెప్పారు. మంత్రిగా ఉన్న రోజాని ఎలా తిట్టినా తప్పించుకుని తిరగొచ్చని బండారు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. బండారు చేసిన వ్యాఖ్యల వల్ల చాలా అవమాన పడ్డామన్నారు. చట్టాల్లో మార్పు రావాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి బెయిల్ రాకూడదని, వెంటనే శిక్ష పడాలని అన్నారు మంత్రి రోజా.