Telugu Global
Andhra Pradesh

పురందేశ్వరిని తరిమేయండి.. బీజేపీ నాయకులకు రోజా పిలుపు

పురందేశ్వరికి నీతి నిజాయితీ లేదని చెప్పారు మంత్రి రోజా. కేవలం ఎన్టీఆర్ కూతురు అనే ట్రంప్ కార్డ్ తో ఆమె అన్ని పార్టీలు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

పురందేశ్వరిని తరిమేయండి.. బీజేపీ నాయకులకు రోజా పిలుపు
X

పురందేశ్వరిని బీజేపీనుంచి తరిమేయాలని ఆ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు మంత్రి రోజా. ఆమె వల్ల పార్టీకి ఉపయోగం లేకపోగా.. ఉన్న ఓట్లుకూడా పోయేలా ఉన్నాయని, ఆమె బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉంటూ టీడీపీకోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. పార్టీ విధి విధానాలను పక్కనపెట్టి టీడీపీకోసం పనిచేస్తున్నారని, ఇకనైనా బీజేపీ నాయకులు కళ్లు తెరవాలని కోరారు రోజా.

సీఎం జగన్ పై ఉన్న కేసుల్ని త్వరగా విచారించాలంటూ పురందేశ్వరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం శోచనీయమన్నారు మంత్రి రోజా. తనపై ఉన్న అక్రమ కేసు విషయంలో త్వరితగతిన విచారణ చేపట్టాలని స్వయంగా జగనే కోరారని, దమ్మున్న నాయకుడి లక్షణం అది అని చెప్పారు. చంద్రబాబు ఆ సాహసం చేయగలరా అని ప్రశ్నించారు. 18 సంవత్సరాలు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ స్టేలు తెచ్చుకున్న నేతగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారని విమర్శించారు. చంద్రబాబు అవినీతిపై పురందేశ్వరి సీబీఐకి లేఖ రాయాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ కూతురనే ట్రంప్ కార్డ్ తో..

పురందేశ్వరికి నీతి నిజాయితీ లేదని చెప్పారు మంత్రి రోజా. కేవలం ఎన్టీఆర్ కూతురు అనే ట్రంప్ కార్డ్ తో ఆమె అన్ని పార్టీలు తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ కి ఓ పూట కూడా ఆమె అన్నం పెట్టలేదని, పైగా చంద్రబాబుకంటే పెద్ద వెన్నుపోటు తండ్రికి పొడిచింది ఆమేనని అన్నారు. ఎన్టీఆర్ ని దింపేసిన తర్వాత సీఎం కుర్చీకోసం చంద్రబాబు, పురందేశ్వరి కొట్టుకున్నారని.. ఇప్పుడు బావ కళ్లలో ఆనందం కోసం ఆయన రాసిచ్చిన స్క్రిప్ట్ లను పురందేశ్వరి చదువుతోందన్నారు. ఇలాంటి కూతుళ్ల వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు పురందేశ్వరి.

First Published:  8 Nov 2023 2:48 AM
Next Story