నేను రెడీ.. భువనేశ్వరి మీరు రెడీయా..?
ఎన్నడూ బయటకు రాని మా అమ్మ ఈరోజు బయటకు వచ్చిందని లోకేష్ అంటున్నారని.. అసలామె ఎవరికోసం బయటకు వచ్చారని ప్రశ్నించారు మంత్రి రోజా. తప్పులు చేసిన భర్త, కొడుకుకోసం ఆమె బయటకు వచ్చారని వివరించారు.
సీబీఐ ఎంక్వయిరీకి తాను రెడీ అని, తనతోపాటు భువనేశ్వరి కూడా రెడీయా అని ప్రశ్నించారు మంత్రి రోజా. తన ఆస్తులపై కూడా సీబీఐ ఎంక్వయిరీ కోరాలని టీడీపీ నేతలు సలహా ఇచ్చారని.. ఒకే లేఖలో తన పేరు, భువనేశ్వరి పేరు రాసి ఎంక్వయిరీ కోరదామని ఆమె సవాల్ విసిరారు. భువనేశ్వరి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. నటిగా 1991నుంచి తన సంపాదన మొదలైందని.. అప్పటినుంచి ఇప్పటి వరకు ఎంక్వయిరీ చేయిద్దామన్నారు రోజా. అదే సమయంలో ఎన్టీఆర్ కూతురుగా భువనేశ్వరికి ఎన్ని ఆస్తులున్నాయి, చంద్రబాబు భార్యగా ఆమె ఆస్తుల విలువ ఎంత.. అక్రమ సంపాదన ఎంత అనే విషయాలపై విచారణ జరిపించాలన్నారు.
నిజంగానే నిజం గెలవాలి..
భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర విజయవంతం కావాలని.. "నిజం గెలవాలి మిగతా స్కాముల్లో కూడా చంద్రబాబు దొరకాలి" అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు రోజా. చంద్రబాబు రాజమండ్రి జైలులోకి వెళ్లిన తర్వాత టీడీపీ నేతల చిన్నమెదడు చితికిపోయిందని, వారి మాటలు అలాగే ఉన్నాయని అన్నారు రోజా. వందల కోట్లు చంద్రబాబు దోచుకోకపోతే.. ఇన్నిరోజులు ఎందుకు బెయిల్ రాలేదని ప్రశ్నించారు. కోట్లాది రూపాయాలు ఫీజులు చెల్లించి ఢిల్లీ నుంచి లాయర్లను పిలిపించినా చంద్రబాబుకి బెయిల్ రావడంలేదని ఎద్దేవా చేశారు. ఒక్క కేసులో ఒక్క ఆధారంతోనే ఇన్ని రోజులు ఆయన జైలులో ఉన్నాడంటే, మిగతా కేసుల్లో నిజాలు బయటకు వస్తే.. చంద్రాబాబు జీవితాంతం జైలులోనే ఉండాల్సి వస్తుందని చెప్పారు రోజా.
ఎవరికోసం బాబూ..!
ఎన్నడూ బయటకు రాని మా అమ్మ ఈరోజు బయటకు వచ్చిందని లోకేష్ అంటున్నారని.. అసలామె ఎవరికోసం బయటకు వచ్చారని ప్రశ్నించారు మంత్రి రోజా. తప్పులు చేసిన భర్త, కొడుకుకోసం ఆమె బయటకు వచ్చారని వివరించారు. చంద్రబాబు, లోకేష్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదని, స్కాములు చేశారని అన్నారు రోజా.