విమర్శలకు రోజా చుడీ`దారులు`.. ఉద్యోగితో చెప్పులు మోయించిన మంత్రి
సముద్రం ఒడ్డున నడుస్తూ తన చెప్పులను ఓ ఉద్యోగిని మంత్రి రోజా పట్టుకోమని చెప్పడం మరో వివాదానికి దారి తీసింది. ఆయన చెప్పులు పట్టుకుని మంత్రి వెంట నడవడం వైరల్ గా మారింది.
రోజూ ఏదో ఒక మాధ్యమం ద్వారా మనకు కనిపించే ఏపీ మంత్రి రోజా. పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రిగా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా రోజా వేదికపై నిండుగా కనిపిస్తారు. సినీనటిగా, జబర్దస్త్ జడ్జిగా కూడా రోజా బాగా ఫేమస్. టిడిపిలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. వైసీపీలో చేరి మరింతగా బలంగా తన గళాన్ని వినిపించారు. గెలిచి, మంత్రి అయి ఐరన్ లెగ్ అని ఆరోపించిన నోళ్లను మూయించారు. అంతా బాగానే ఉంది కానీ, వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు ముందూ వెనుకా చూడకుండా రోజా టిడిపి నేతలపై చేసిన విమర్శలు ఆమెకి ఇప్పుడు బూమరాంగ్ అవుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా అప్పటి మంత్రి అఖిలప్రియని టార్గెట్ గా విమర్శలు చేశారు. తల్లిని కోల్పోతే ఎమ్మెల్యే, తండ్రిని కోల్పోయి మంత్రి పదవి తేలిగ్గా దొరగ్గానే అఖిలప్రియకి కొమ్ములు వచ్చాయా అని రోజా నిలదీశారు.
సంస్కారం, సంప్రదాయం గురించి అఖిలప్రియకు మాట్లాడే హక్కు లేదన్న రోజా ఆమె దుస్తుల గురించి వ్యాఖ్యానించడం అప్పట్లో కలకలం రేపింది. బొట్టు, చీరకట్టు లేకుండా మగాడిలా చుడీదార్ వేసుకున్నావని అఖిల ప్రియ మీద రోజా విరుచుకుపడ్డారు. దీనిపై అప్పట్లోనే పెద్ద దుమారం చెలరేగింది. రోజా సినిమాలలో వేసుకున్న రకరకాల పొట్టి డ్రెస్సుల ఫొటోలతో టిడిపి వారు కౌంటర్ పోస్టులు వేశారు.
టిడిపి అధికారం కోల్పోయింది. ఓడిపోయిన అఖిలప్రియ మంత్రి పదవికి దూరమైంది. వైసీపీ గెలిచింది. గెలిచిన రోజా రెండో విడతలో మంత్రి పదవి చేపట్టింది. ఇంతవరకూ అంతా బాగానే ఉంది. మగాడిలా చుడీదార్ వేసుకున్న మంత్రి అఖిలప్రియ అంటూ రోజా తాను చేసిన వ్యాఖ్యలను మరిచిపోయినట్టున్నారు. పర్యాటకశాఖా మంత్రిగా సూర్యలంక సముద్ర తీరంలో పర్యటించారు. ఈ సందర్భంగా చుడీదార్ వేసుకున్న రోజాని విజువల్స్‌ని టిడిపి పట్టుకుంది. అప్పట్లో అఖిలప్రియ చుడీదార్ వేసుకోవడం నేరమన్నట్టు మాట్లాడిన రోజా చుడీదార్ ఎలా వేసుకుందని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
సముద్రం ఒడ్డున నడుస్తూ తన చెప్పులను ఓ ఉద్యోగిని మంత్రి రోజా పట్టుకోమని చెప్పడం మరో వివాదానికి దారి తీసింది. బీచులో చుడీదార్ వేసుకుని నడిచేందుకు వెళుతూ సూర్యలంక రిసార్ట్స్ లో పనిచేస్తున్న నాగరాజుని తన చెప్పులు పట్టుకోమనడం, ఆయన చెప్పులు పట్టుకుని మంత్రి వెంట నడవడం వైరల్ గా మారింది. దీనిపై మంత్రి రోజా స్పందన ఎలా ఉంటుందో మరి వేచి చూడాలి.