ఆ లిస్ట్ చూశాక మా గెలుపుపై ధీమా పెరిగింది -రోజా
టీడీపీ, జనసేన జాబితాలు చూసిన తర్వాత వైసీపీ అభ్యర్థులు ఆల్రడీ గెలిచినట్లు సంబరాలు చేసుకున్నారని తెలిపారు రోజా.
టీడీపీ, జనసేన అభ్యర్థుల లిస్ట్ లు అత్యంత పేలవంగా ఉన్నాయని అన్నారు మంత్రి రోజా. వారి జాబితాలు చూసిన తర్వాత వైసీపీ అభ్యర్థులు ఆల్రడీ గెలిచినట్లు సంబరాలు చేసుకున్నారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా జెండా మోసిన వాళ్లకి టీడీపీ సీట్లు ఇవ్వలేదని విమర్శించారు. జనసేన కూడా వలస నేతలకే టికెట్లు ఇచ్చిందన్నారు రోజా. ఆ రెండు పార్టీల లిస్ట్ చూస్తే వైసీపీ విజయం ఖరారైపోయిందని ధీమా వ్యక్తం చేశారు.
లాజిక్ చెప్పలేదేం..?
గతంలో టీడీపీ, జనసేనకు 24 సీట్లు కేటాయిస్తే పవన్ కల్యాణ్ తనదైన శైలిలో లాజిక్ చెప్పారు. "24 సీట్లు అని తక్కువగా చూడకండి, గాయత్రీ మంత్రంలో అక్షరాలు కూడా ఇరవైనాలుగే"నంటూ జనసైనికులకు సర్దిచెప్పుకున్నారు. ఇప్పుడు బీజేపీకోసం మూడు సీట్లు త్యాగం చేసి 21 సీట్లకు పరిమితమయ్యారు పవన్. మరిప్పుడేం లాజిక్ చెబుతారంటూ వెటకారమాడారు రోజా. త్రివిక్రమ్ స్క్రిప్ట్ రాసివ్వలేదా అని ఎద్దేవా చేశారు.
ఆ క్రేజ్ అలాంటిది..
ఏ సినీ నటుడుకి లేని క్రేజ్ సీఎం జగన్ కి ఉందన్నారు మంత్రి రోజా. ఈ నెల 27 తేదీ నుండి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభిస్తారని, ఆ యాత్ర కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. జగన్ సభలలో పాల్గొనేందుకు వైసీపీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారని అన్నారు. 2014లో గెలిచి రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశారని, ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా సహా చాలా హామీలు ఇచ్చారని, చివరకు ఆయనకే శఠగోపం పెట్టారని మండిపడ్డారు. కూటమికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు రోజా.