జగనే మళ్లీ సీఎం కావాలని గంగమ్మ తల్లికి సారె..
వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు మంత్రి రోజా. తమ హయాంలో అమలైన సంక్షేమ పథకాలే తమకు మరోసారి అధికారాన్ని అప్పగిస్తాయని చెప్పారు.
వైసీపీదే మళ్లీ అధికారం అని ఆ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఇటీవల ఐప్యాక్ మీటింగ్ లో సీఎం జగన్ చెప్పిన మాటలు వారికి మరింత ఉత్సాహాన్నిచ్చాయి. గతంలోకంటే మరిన్ని ఎక్కువ సీట్లు ఈసారి వైసీపీకి వస్తాయని తేల్చి చెప్పారు జగన్. ఈ క్రమంలో ఆయన మరోసారి సీఎం కావాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు పూజలు చేస్తున్నారు. మంత్రి రోజా కూడా జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుతూ తిరుపతి తాతయ్య గుంటలోని గంగమ్మ తల్లికి సారె సమర్పించారు.
సీఎం జగన్ మళ్ళీ గెలుస్తారు.. గంగమ్మ తల్లికి సారె సమర్పించిన రోజా pic.twitter.com/gkndxuwBgx
— Rahul (@2024YCP) May 18, 2024
వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు మంత్రి రోజా. తమ హయాంలో అమలైన సంక్షేమ పథకాలే తమకు మరోసారి అధికారాన్ని అప్పగిస్తాయని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుంచి క్రమం తప్పకుండా గంగమ్మ తల్లి ఆలయానికి వస్తున్నానని, ఈసారి జగన్ సీఎం కావాలని కోరుకుంటూ సారె సమర్పించానని చెప్పారు. తాను సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న టైమ్ లోనే గంగమ్మ తల్లి జాతరకు రాష్ట్ర పండగగా గుర్తింపు రావడం సంతోషకరమైన విషయం అని అన్నారు రోజా.
వైసీపీలో ఫుల్ జోష్..
ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా వైసీపీ నేతలు విజయంపై ధీమాతో ఉన్నారు. మళ్లీ విజయం తమదేనని, సంక్షేమ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని అంటున్నారు. పెరిగిన పోలింగ్ శాతం కూడా వైసీపీకి అనుకూలం అంటున్నారు. కూటమి కట్ట కట్టుకుని వచ్చినా కూడా వైసీపీకి ఎలాంటి నష్టం జరగలేదని చెబుతున్నారు. మంత్రి రోజా కూడా ఈసారి తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు.