వాళ్లు వైసీపీ నుంచి బయటకు వెళ్తే నాకు బంపర్ మెజార్టీ
నగరిలో తాను ప్రతిపక్షాలతో పాటు, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వెన్నుపోటు దారులతో కూడా పోరాటం చేయాల్సి వస్తోందన్నారు రోజా.
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అక్కడక్కడ ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. అయితే ఆ ఇబ్బందులు పోలింగ్ నాటికి ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది తేలాల్సి ఉంది. నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు అసమ్మతి సెగ రోజు రోజుకూ పెరుగుతోంది. రోజా అసమ్మతి వర్గం బలమెంత అనేది పక్కనపెడితే.. వైసీపీలోనే ఉంటూ వారు రోజాని ఇబ్బంది పెడుతున్నారు. పోనీ వారిని పార్టీనుంచి బయటకు పంపిద్దామంటే అది ఆమెకు సాధ్యం కావడంలేదు. దీంతో మినిస్టర్ పోస్ట్ లో ఉన్నా కూడా సొంత నియోజకవర్గంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోజా. తాజాగా వైరి వర్గంపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పొండిరా బాబూ..
‘జగనన్న ముద్దు.. రోజమ్మ వద్దు..’ అంటూ ప్రతిరోజు 500 రూపాయలు కట్టి ప్రెస్ క్లబ్ లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు రోజా. అలాంటి వారు వైసీపీలో ఉంటే తనకు నగరిలో కేవలం 500 ఓట్ల మెజార్టీ వస్తుందని, వారు పార్టీ నుంచి బయటకు వెళ్తే నగరిలో 30 నుంచి 40 వేల మెజారిటీతో గెలుస్తానని చెప్పారు. వారు పార్టీనుంచి వెళ్లిపోతే బాగుంటుందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు రోజా.
వాళ్లు మాట్లాడినట్టుగా తన వర్గం కూడా మాట్లాడితే తట్టుకోలేగలరా..? బతకగలరా..? అంటూ మండిపడ్డారు మంత్రి రోజా. నగరిలో మాట్లాడటానికి ధైర్యం లేక, తిరుపతిలో కూర్చొని నగరి పేరు ప్రతిష్టలు దిగజారుస్తున్నారని విమర్శించారు. వారందరికీ బుద్ది చెప్పే సమయం వచ్చిందని హెచ్చరించారు. నగరిలో గత ఎమ్మెల్యేలెవరూ చేయలేని అభివృద్ధిని తాను చేసి చూపించానన్నారు రోజా. నగరిలో తాను ప్రతిపక్షాలతో పాటు, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వెన్నుపోటు దారులతో కూడా పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. వారితో పోరాడుతూనే మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు సజావుగా సాగేలా చూస్తున్నానని చెప్పారు రోజా.