కాలేజీల్లో ర్యాగింగ్ జరగకుండా కఠినంగా ఉండండి.. ఏపీ మంత్రి కీలక ఆదేశాలు
ర్యాగింగ్ ఎంత నేరమో విద్యార్థులకు వివరించాలని, మెడికల్ కళాశాలల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులు ఎవరైనా ఒత్తిడితో బాధపడుతుంటారో అలాంటి వారిని గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు.
తెలంగాణలో ర్యాగింగ్ భూతం కారణంగా మెడికో ప్రీతి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో ర్యాగింగ్ పై ఉక్కు పాదం మోపేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రీతి ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటోంది. తెలంగాణలో ర్యాగింగ్ కారణంగా ఓ మెడికో ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కళాశాలల్లో ర్యాగింగ్ జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది.
తాజాగా మంత్రి విడదల రజిని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల ప్రిన్సిపల్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీల్లో ర్యాగింగ్ జరగకుండా ఉండేందుకు పలు కీలక సూచనలు చేశారు. కళాశాలల్లో ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడుతున్నట్లు తెలిస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలు పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని సూచించారు. ర్యాగింగ్ వల్ల ఎటువంటి అనర్థాలు తలెత్తుతున్నాయి.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో విద్యార్థులకు వివరించాలని సూచించారు.
ర్యాగింగ్ ఎంత నేరమో విద్యార్థులకు వివరించాలని, మెడికల్ కళాశాలల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులు ఎవరైనా ఒత్తిడితో బాధపడుతుంటారో అలాంటి వారిని గుర్తించి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. అన్ని కళాశాలల్లో 24 గంటల హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్స్‌ను మంత్రి ఆదేశించారు. కాలేజీ క్యాంపస్ లో ప్రశాంత వాతావరణం కోసం విద్యార్థులతో యోగా, ధ్యానం నిర్వహించాలన్నారు. మెడికల్ కళాశాలల్లో పీజీ విద్యార్థులకు పనిభారం లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.