Telugu Global
Andhra Pradesh

పవన్ సీఎం కావాలి.. ట్రోలింగ్ దెబ్బకి ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి

జగన్ తొలి కేబినెట్ లోనే తనకు మంత్రి పదవి వచ్చిందని, రెండోసారి కొనసాగించారని అన్నారు. అలాంటి తాను ఏం ఆశించి జనసేనలోకి వెళ్తానని ప్రశ్నించారు మంత్రి పినిపే విశ్వరూప్.

పవన్ సీఎం కావాలి.. ట్రోలింగ్ దెబ్బకి ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి
X

ఇటీవల మంత్రి పినిపే విశ్వరూప్ తిరుమలలో చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. పవన్ సీఎం కావాలని కోరుకుంటున్న వ్యక్తుల్లో తాను కూడా ఒకడినంటూ ఆయన అనడంతో మీడియాలో పెద్ద దుమారం రేగింది. మంత్రి పార్టీ మారుతున్నారని, అందుకే హింటిచ్చారని, ఆయనకు జగన్ కంటే పవన్ సీఎంగా ఉండటం ఇష్టమని.. ఇలా రకరకాల భాష్యాలు చెప్పాయి న్యూస్ ఛానెల్స్. సాక్షాత్తూ మంత్రివర్గ సహచరులు కూడా ఆయనపై కౌంటర్లు వేశారు. ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం, మాకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు కొందరు మంత్రులు. దీంతో మంత్రి పినిపే విశ్వరూప్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన వ్యాఖ్యల్ని మీడియా వక్రీకరించిందన్నారాయన.

"ప్రజాస్వామ్యంలో ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చు, కానీ మెజారీటి తెచ్చుకోవాలి, మెజార్టీ రావాలంటే మొత్తం స్థానాలు, లేదా అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలి" అని మాత్రమే తాను చెప్పానని గుర్తు చేశారు మంత్రి విశ్వరూప్. అలా పోటీ చేయలేరు కాబట్టి, పవన్ ముఖ్యమంత్రి కాలేరన్నానని చెప్పారు. తాను కావాలని కోరుకున్నా మెజార్టీ స్థానాల్లో పోటీ చేయలేని ఆయన సీఎం కాలేరని అన్నారు. కానీ తన మాటల్ని వక్రీకరించి రెండు రోజులుగా మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయని మండిపడ్డారు మంత్రి విశ్వరూప్.

ఇదీ నా క్యారెక్టర్..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన తాను ఉమ్మడి రాష్ట్ర కేబినెట్‌ లో మంత్రిగా ఉంటూ రాజీనామా చేసి వైసీపీలో చేరానని గుర్తు చేసుకున్నారు మంత్రి విశ్వరూప్. పదవులకోసం వైసీపీలోకి రాలేదని, అప్పటినుంచి బాధ్యతగా పనిచేస్తున్నానని చెప్పారు. జగన్ తొలి కేబినెట్ లోనే తనకు మంత్రి పదవి వచ్చిందని, రెండోసారి కొనసాగించారని అన్నారు. అలాంటి తాను ఏం ఆశించి జనసేనలోకి వెళ్తానని ప్రశ్నించారు. వార్త రాసేముందు ఆలోచించాలని మీడియాకు క్లాస్ తీసుకున్నారు. అగ్రెసివ్ పాలిటిక్స్ తనకు ఇష్టం లేదని, తాను వ్యక్తిగతంగా ఎవరినీ తిట్టనని, విమర్శించనని, అది తన నైజం అని వివరణ ఇచ్చారు. కోనసీమ ప్రజలు శాంతికాముకులు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు సహించరని అన్నారు. దయచేసి తన మాటలను వక్రీకరించొద్దని కోరారు.

First Published:  27 Jun 2023 7:31 PM IST
Next Story