Telugu Global
Andhra Pradesh

ఏపీలో దళిత మంత్రికి నిజంగానే అవమానం జరిగిందా...?

సీఎంసహా చుట్టూ ఉన్నవారు కుర్చీల్లో ఉంటే, సీఎం కుర్చీపక్కనే దళిత మంత్రి పినిపే విశ్వరూప్ మోకాళ్లపై కూర్చుని ఉన్న ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఏపీలో దళిత మంత్రికి నిజంగానే అవమానం జరిగిందా...?
X

పిక్చర్ క్లారిటీగానే ఉంది. సీఎం జగన్ కుర్చీలో ఉన్నారు, ఆయన చుట్టూ మహిళలు కుర్చీల్లో కూర్చున్నారు, అయితే మంత్రి పినిపే విశ్వరూప్, జగన్ కుర్చీ పక్కనే మోకాళ్లపై కూర్చుని ఫొటోలో ఉన్నారు. ఇదేమీ ఫేక్ కాదు, గ్రాఫిక్ మాయాజాలం కాదు. కానీ అక్కడ సందర్భం వేరు అంటున్నారు మంత్రి. కాదు కాదు, దళిత మంత్రికి జరిగిన అవమానం అది అని చెబుతున్నాయి ప్రతిపక్షాలు.

సీఎంసహా చుట్టూ ఉన్నవారు కుర్చీల్లో ఉంటే, సీఎం కుర్చీపక్కనే దళిత మంత్రి పినిపే విశ్వరూప్ మోకాళ్లపై కూర్చుని ఉన్న ఫొటో, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.సున్నా వడ్డీ నిధుల విడుదల సందర్భంగా అమలాపురంలో జరిగిన సభలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఈ సీన్ తోపాటు, ప్రతిపక్షాల వ్యాఖ్యానాలు మరింత హాట్ హాట్ గా ఉన్నాయి. సీఎం జగన్, దళిత మంత్రిని అవమానించారని అంటున్నారు ప్రతిపక్ష నేతలు. కనీసం ఆయనకు వేదికపై సీటు లేకుండా చేశారని విమర్శించారు.

మంత్రి మాత్రం అందులో తప్పేమీ లేదన్నారు. వేదికపై మహిళలు సీఎం జగన్ తో గ్రూప్ ఫొటో తీసుకోవాలనుకున్నారని, అందరూ కూర్చున్న తర్వాత తాను వేదికపైకి వెళ్లానని చెప్పారు. అప్పటికి కుర్చీలు ఖాళీ లేకపోవడంతో అక్కడే నిలుచున్నానని, అయితే తన వెనక ఉన్న మహిళలు ఫొటోలో కనపడరనే ఉద్దేశంతో తాని వంగి కూర్చున్నానని చెప్పుకొచ్చారు. అంతే తప్ప అందులో తనకు జరిగిన అవమానం ఏదీ లేదన్నారు. రాజకీయ విమర్శలు సరికావని ప్రతిపక్షాలకు హితవు పలికారు పినిపే విశ్వరూప్.

First Published:  12 Aug 2023 1:21 PM IST
Next Story