జగన్ బస్సు యాత్రతో ఆ నమ్మకం మరింత పెరిగింది
జగన్ యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని జనం 'మేమంతా సిద్ధం' యాత్రలకు వస్తున్నారని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
వైనాట్ 175 అనే టార్గెట్ వైసీపీకి అసాధ్యం కాదని, సుసాధ్యం అని చెబుతున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జగన్ బస్సు యాత్రతో 175 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామనే నమ్మకం వైసీపీ శ్రేణుల్లో మరింత పెరిగిందన్నారు. జగన్ యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని జనం 'మేమంతా సిద్ధం' యాత్రలకు వస్తున్నారని చెప్పారు. చంద్రబాబుకి రాయలసీమలో కూడా ఓటు అడిగే హక్కు లేదని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు కట్టలేదని, సీఎం జగన్ హయాంలోనే రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని అన్నారు.
అమిత్ షా కాళ్లు పట్టుకుని..
ఢిల్లీ వెళ్లి అమిత్ షా కాళ్లు పట్టుకుని బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు మంత్రి పెద్దిరెడ్డి. రోజుల తరబడి ఢిల్లీలో పడిగాపులు కాసి పొత్తు పెట్టుకున్నారని, ఇప్పుడు బీజేపీయే తనను పొత్తుకి పిలిపించని అబద్దాలాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. పొత్తులేనిదే చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేరని, బాబు గత చరిత్ర అంతా పొత్తుల మయం అని అన్నారు పెద్దిరెడ్డి.
ఆయనది లంచాల చరిత్ర..
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ టికెట్ పై రాజంపేట లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఇక్కడ పెద్ది రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆఫీస్ పెట్టి లంచాలు వసూలు చేసిన చరిత్ర కిరణ్ కుమార్‌రెడ్డిదని అన్నారు. పోలింగ్ పూర్తయిన రోజే కిరణ్ కుమార్‌రెడ్డి సూట్ కేసు సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోతారని సెటైర్లు పేల్చారు. సీఎం పదవి కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి అని విమర్శించారు. సీఎం జగన్‌ని అణగదొక్కడానికి సోనియాగాంధీతో కుమ్మక్కయ్యారని, ఆయన్ను ఇప్పుడు ఓడించి తగిన బుద్ధి చెబుతామని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి.