Telugu Global
Andhra Pradesh

కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం - పెద్దిరెడ్డి

గతంలో ఎంపీగా పోటీ చేసిన ఇద్దరు కేంద్ర మంత్రులను తాము ఓడించామని, ఇప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడిస్తామని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం - పెద్దిరెడ్డి
X

మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తామని వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

నల్లారి కుటుంబం 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కూడా సొంత జిల్లాను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కూడా గతంలో జిల్లాకు నీరు రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణే కారణమని ఆరోపించారు. ఆయనొక నమ్మకద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ ను వేధించారని అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారని కిరణ్ పై పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ఎంపీగా పోటీ చేసిన ఇద్దరు కేంద్ర మంత్రులను తాము ఓడించామని, ఇప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడిస్తామని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబం, పెద్దిరెడ్డి కుటుంబం మధ్య దశాబ్దాలుగా రాజకీయ వైరం ఉంది. వేర్వేరు పార్టీల్లో ఉండి ఒకరిపై మరొకరు తలపడటమే కాదు.. ఒకే పార్టీలో ఉన్న సమయంలో కూడా వారి మధ్య వైరం కొనసాగింది. ఒకానొక సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం నచ్చని పెద్దిరెడ్డి ఏకంగా కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. కాగా కొన్నేళ్ళ విరామం తర్వాత ఇప్పుడు మరోసారి నల్లారి, పెద్దిరెడ్డి కుటుంబాలు రాజకీయంగా పోటీపడుతున్నాయి. పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి వైసీపీ తరపున రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో మరోమారు ఆ రెండు కుటుంబాల మధ్య రాజకీయ పోరు మొదలైంది.

First Published:  5 April 2024 9:21 AM GMT
Next Story