Telugu Global
Andhra Pradesh

''అక్కడా ఉంటా.. ఇక్కడా ఉంటా'' అంటున్న పెద్దిరెడ్డి

పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలను తిరుపతి జిల్లాలోకి విలీనం చేసేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగం సిద్ధం చేయించారు. రెండు మండలాలు తిరుపతి జిల్లాలోకి వెళ్తే అప్పుడు చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి జిల్లాకు పెద్దిరెడ్డి లోకల్ మంత్రే అవుతారు.

అక్కడా ఉంటా.. ఇక్కడా ఉంటా అంటున్న పెద్దిరెడ్డి
X

జిల్లాల పునర్ విభజన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు చిత్తూరు జిల్లాలోకి వెళ్లిపోయింది. తిరుపతి జిల్లాకు పెద్దిరెడ్డి నాల్ లోకల్ అయిపోయారు. పెద్దిరెడ్డి కుటుంబం తిరుపతిలో నివాసం ఉంటోంది. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాల నేతలతో ఆయన నివాసం వద్ద ఎప్పుడూ సందడి ఉండేది. జిల్లా విభజన తర్వాత తిరుపతి జిల్లా నేతలు ఆయన వద్దకు రావడం తగ్గించేశారు. కారణం పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా మంత్రి అయిపోవడమే. ప్రోటోకాల్ విషయంలోనూ తిరుపతి జిల్లాలో పెద్దిరెడ్డి ప్రాధాన్యత తగ్గింది. తిరుపతి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాల్లో చోటు లేకుండాపోయింది. ఈ పరిణామం టీడీపీని సంతోషపెట్టింది. పెద్దిరెడ్డి ప్రభావం చిత్తూరు జిల్లాకు పరిమితం అవుతుందని రిలీఫ్‌ అయ్యారు.

ఇప్పుడు పరిస్థితి మారేలా ఉంది. తిరుపతి జిల్లాలోని కొన్ని నియోజవకర్గాల్లో తనకు ప్రత్యేక బలం ఉన్నప్పటికీ జిల్లా విభజన కారణంగా అది సన్నగిల్లే పరిస్థితి ఏర్పడింది. దాంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలను తిరుపతి జిల్లాలోకి విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేయించారు. పుంగనూరులోని రెండు మండలాలు తిరుపతి జిల్లాలోకి వెళ్తే అప్పుడు చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి జిల్లాకు పెద్దిరెడ్డి లోకల్ మంత్రే అవుతారు. పైగా ఈ రెండు మండలాలను తిరుపతి రెవెన్యూ డివిజన్‌లో కలపాలని చాలా ఏళ్లుగా డిమాండ్ ఉంది.

పెద్దిరెడ్డే ప్రతిపాదించడంతో సీఎంవో కూడా దాదాపు ఓకే చెప్పేసింది. రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలను తిరుపతి జిల్లాలోకి కలిపే ప్ర‌క్రియ మొదలుపెట్టాలని రెవెన్యూ శాఖకు సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి జిల్లా రాజకీయ వ్యవహారాల్లోనూ పెద్దిరెడ్డి పట్టు తిరిగి నిలబడుతుంది. పెద్దిరెడ్డి లాంటి సీనియర్ నాయకుడి సేవలను కేవలం చిత్తూరు జిల్లాకే పరిమతం చేయకుండా తిరుపతి జిల్లాలోనూ వాడుకోవాలని ముఖ్యమంత్రి కూడా భావించడంతో పెద్దిరెడ్డి ప్రతిపాదనకు ఆమోదముద్ర పడేందుకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి.


First Published:  5 Sept 2023 9:30 PM IST
Next Story