Telugu Global
Andhra Pradesh

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డికి కొత్త తలనొప్పి.. యువనేత మళ్లీ యాక్టీవ్!

పుంగనూరులో గత కొన్నిరోజులుగా మళ్లీ రామచంద్ర యాదవ్ యాక్టీవ్ అయ్యారు. జిల్లాలోని ప్రాజెక్ట్‌లపై మాట్లాడుతూ పెద్దిరెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని ప్రాజెక్ట్‌ల పరిశీలనకి ఆయన వెళితే పోలీసులు అడ్డుకున్నారట.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డికి కొత్త తలనొప్పి.. యువనేత మళ్లీ యాక్టీవ్!
X

చిత్తూరు జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. ఇన్నాళ్లూ నియోజకవర్గంలో ఏ నాయకుడు కూడా పెద్దిరెడ్డికి కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయారు. దాంతో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ మంత్రిగా కూడా ఆయన కొనసాగుతున్నారు. అయితే రాబోవు ఎన్నికల్లో అతనికి యంగ్ బిజినెస్‌మెన్ రామచంద్ర యాదవ్ రూపంలో గట్టి పోటీ ఎదురుకాబోతోంది. 2024 ఎలక్షన్స్ కోసం అప్పుడే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన రామచంద్ర యాదవ్.. నియోజకవర్గంలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు.

వాస్తవానికి ఈ రామచంద్ర యాదవ్ 2019 ఎన్నికల్లోనే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ఢీకొన్నారు. అప్పట్లో జనసేన తరఫున పోటీ చేసిన ఇతనికి పడిన ఓట్లు కేవలం 16,452 మాత్రమే. కానీ పెద్దిరెడ్డి‌కి మాత్రం ఏకంగా 1,07,431 ఓట్లు పడ్డాయి. అయితే రాబోవు ఎన్నికల్లో టీడీపీ - జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. ఇది పెద్దిరెడ్డికి తలనొప్పిగా మారబోతోంది. ఎందుకంటే.. అప్పట్లో టీడీపీ అభ్యర్థి ఎన్. అనీషా రెడ్డి‌కి 63,876 ఓట్లు పడ్డాయి. ఓవరాల్‌గా టీడీపీ + జనసేన ఓట్లు కలిపితే 80,328 ఓట్లు అన్నమాట. ఓట్ల శాతంగా చూసుకున్నా ఈ రెండు పార్టీలు అప్పట్లో సుమారు 41% ఓట్లని నియోజకవర్గంలో దక్కించుకున్నాయి. దాంతో రాబోవు ఎన్నికల్లో ఇంకాస్త కష్టపడితే పుంగనూరులో జెండా ఎగురవేయొచ్చనే అంచనాకి వచ్చిన రామచంద్ర యాదవ్.. గత ఏడాది నుంచే మళ్లీ కసరత్తులు ప్రారంభించారు. కానీ అక్కడి నుంచే పుంగనూరులో అసలు రాజకీయం మొదలైంది.

గత ఏడాది చివర్లో పుంగనూరు నియోజకవర్గంలోని రైతు సమస్యలపై సదుంలో రైతు భేరి సభని నిర్వహించాలని రామచంద్ర యాదవ్ ప్రయత్నించారు. కానీ.. ఆ సభకి పోలీసులు అనుమతించలేదు. దాంతో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అయితే ఆ ర్యాలీ ముగిసిన గంటల వ్యవధిలోనే అతని ఇంటికి వెళ్లిన ఓ గ్యాంగ్.. కర్రలు, రాళ్లతో దాడిచేసింది. ఇంటి ఆవరణలోని కార్లని, ఫర్నిచర్‌‌ని ధ్వంసం చేసింది. చివరికి పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులకి రామచంద్ర యాదవ్ అప్పట్లో ఫిర్యాదు చేయడంతో పాటు తన పలుకుబడిని వినియోగించుకుని వై ప్లస్ కేటగిరి భద్రతని ఏర్పాటు చేసుకున్నారు.

పుంగనూరులో గత కొన్నిరోజులుగా మళ్లీ రామచంద్ర యాదవ్ యాక్టీవ్ అయ్యారు. జిల్లాలోని ప్రాజెక్ట్‌లపై మాట్లాడుతూ పెద్దిరెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని ప్రాజెక్ట్‌ల పరిశీలనకి ఆయన వెళితే పోలీసులు అడ్డుకున్నారట. దాంతో అతను ఏకంగా హెలికాప్టర్‌ని బుక్ చేసుకుని మరీ ప్రాజెక్ట్‌లపై ఏరియల్ సర్వే నిర్వహించి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అలానే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకం అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. రాబోవు ఎన్నికల్లో అతను ఏ పార్టీ తరఫున పోటీచేస్తాడనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే పెద్దిరెడ్డికి మాత్రం అతను గట్టి పోటీనివ్వబోతున్నాడనే ప్రచారం మాత్రం జిల్లాలో జరుగుతోంది.

First Published:  29 May 2023 3:44 AM GMT
Next Story