Telugu Global
Andhra Pradesh

ఆ చిరుతలు ఇక జూ పార్క్ కే పరిమితం..

కర్రల వివాదంపై కూడా మంత్రి పెద్దిరెడ్డి స్పందించినా, ఆయన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నడకదారి భక్తులకు రక్షణ కోసం కర్రలు ఇచ్చే విషయం, దానిపై జరిగిన వివాదం గురించి తనకు తెలియదని చెప్పారు పెద్దిరెడ్డి.

ఆ చిరుతలు ఇక జూ పార్క్ కే పరిమితం..
X

మ్యాన్ ఈటర్ గా మారిన చిరుత పులుల్ని తిరుపతి జూ పార్క్ లోనే ఉంచుతామని చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వాటిని తిరిగి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టే ఆలోచన ఏదీ లేదన్నారు. కొత్తగా బోనులో చిరుతలను బంధించినా వాటిని జూ పార్క్ కే తరలిస్తామన్నారు. శాశ్వత ప్రాతిపదికన కంచె నిర్మాణం కానీ, సెక్యూరిటీని పెంచడం కానీ చేస్తామన్నారు. ఇకపై చిరుత దాడులు జరగకుండా చూస్తామన్నారు. చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి రూ.5లక్షలు ఆర్థిక సాయం చేశామని చెప్పారు పెద్దిరెడ్డి.

ఘటన జరిగింది టీటీడీ పరిధిలోని అటవీ ప్రాంతంలో అని స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి. అటవీ శాఖలో సిబ్బంది కొరత లేదని చెప్పారు. ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో టీటీడీకి సహకరిస్తామని, వారిని సమన్వయం చేసుకుని చిరుత దాడుల్ని అరికడతామన్నారు. ప్రస్తుతం దీనిపై టీటీడీ నివేదిక సిద్ధం చేస్తోందని, ఆ తర్వాత దానిపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.

శాశ్వత కంచె..

శాశ్వత కంచెపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి పెద్దిరెడ్డి. టీటీడీ నివేదికను ఢిల్లీలోని అటవీ డైరెక్టర్ జనరల్ కి పంపించి వారి అనుమతి తీసుకుని తదుపరి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. తిరుమల మెట్ల మార్గంలో చిరుతల దాడుల్ని నివారించాలంటే శాశ్వత కంచె, లేదా సెక్యూరిటీని భారీగా పెంచడం చేయాలన్నారు పెద్దిరెడ్డి. కర్రల వివాదంపై కూడా మంత్రి పెద్దిరెడ్డి స్పందించినా ఆయన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నడకదారి భక్తులకు రక్షణ కోసం కర్రలు ఇచ్చే విషయం, దానిపై జరిగిన వివాదం గురించి తనకు తెలియదని చెప్పారు పెద్దిరెడ్డి.

First Published:  19 Aug 2023 10:33 AM GMT
Next Story