చంద్రబాబూ.. నిన్ను దేవుడు కూడా క్షమించడు.. - మంత్రి కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు తీరుపై మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. దేవుడితోనే పరాచకాలా.... నిన్ను దేవుడు కూడా క్షమించడు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కేసుల నుంచి తప్పించడానికే దేవదాయ శాఖ ఆధ్వర్యంలో మహా యజ్ఞం చేశారంటూ చంద్రబాబు ఆరోపించడంపై ఆ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ నిప్పులు చెరిగారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి పరాకాష్ట అని చెప్పారు. శనివారం తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. దేవుడితోనే పరాచకాలా.... నిన్ను దేవుడు కూడా క్షమించడు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహాయజ్ఞం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కాళ్లకు చెప్పులు వేసుకుని వచ్చారని చెబుతున్న చంద్రబాబు కళ్ళున్న కబోది అని మంత్రి కొట్టు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆనాడు చంద్రబాబు తిరుమలలో ధ్వజస్తంభం వరకు బూట్లు వేసుకుని వెళ్లినందున అలిపిరి దుర్ఘటన జరిగిందని, అయినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని మంత్రి కొట్టు విమర్శించారు.
కనకదుర్గమ్మ గుడిలో అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేయించిన నీచ చరిత్ర చంద్రబాబుదని మంత్రి కొట్టు విమర్శించారు. తెలుగుదేశం అధికారంలో ఉండగా ఎన్నో గుళ్ళు కూల్చారని, విగ్రహాలు ధ్వంసం చేశారని, రథాలు తగలబెట్టించారని ఆరోపించారు. 2019లో ప్రజలు ఛీ కొట్టినా బుద్ధి రాకుండా మళ్ళీ జనాన్ని మోసం చేసేందుకు మాయమాటలతో మారీచుడిలా తయారయ్యారని విమర్శించారు. అమరావతి శంకుస్థాపనలో బూటు కాళ్లతో వెళ్లి చంద్రబాబు కొబ్బరికాయ కొట్టారని, దానివల్లే అమరావతి అక్కడే ఆగిపోయిందని చెప్పారు. 2024లో తెలుగుదేశం పార్టీకి రాజకీయ సమాధి ఖాయమని, అక్కడితో చంద్రబాబు రాజకీయంగా అంతర్ధానం అవుతాడని మంత్రి కొట్టు అన్నారు.