‘చంద్రబాబు హయాంలో జరిగినవి కనిపించలేదా.. రామోజీ..?’
జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచారం జరుగుతుంటే.. ఈనాడుకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
దేవాలయాలపై రామోజీరావుకు చెందిన ఈనాడులో వచ్చిన వార్తాకథనంపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో జరిగినవి గుర్తుకు రాలేదా అంటూ ఆయన రామోజీరావును ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉద్దేశపూర్వకంగా దేవాలయాలను కూలగొట్టినప్పుడు, దేవుళ్ల విగ్రహాలను చెత్తబండిలో వేసుకని తీసుకు వెళ్లినప్పుడు, దుర్గగుడిలో క్షుద్రపూజలు జరిగినప్పుడు రామోజీరావు ఏం చేశారు, అవన్నీ ఈనాడుకు కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వానికి సంబంధించి ఏ తప్పూ దొరకడం లేదని, అందుకే ఈనాడులో తప్పుడు రాతలు రాస్తున్నారని ఆయన మండిపడ్డారు. గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది వస్తే షూటింగ్ చేసి 30 మందిని చంపేశారని, అప్పుడు ఈనాడు పత్రిక ఆ సంఘటనపై ఏమి రాసిందని ఆయన అన్నారు. ఇప్పుడు తప్పు జరగకపోయినా జరిగినట్లు రాస్తున్నారని ఆయన రామోజీరావును తప్పుపట్టారు.
జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచారం జరుగుతుంటే.. ఈనాడుకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. అంతర్వేది, రామతీర్థంలో జరిగిన ఘటనలను ఇప్పటికి ఎన్నిసార్లు ఉదహరించారని ఆయన రామెజీని అడిగారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఘటనలను మళ్లీ ఎప్పుడైనా ఉదహరించారా అని ప్రశ్నించారు. ఈనాడు కథనం వెనక చంద్రబాబు ఉన్నాడని అనిపిస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబుతో ఉన్న సత్సంబంధాలవల్లనే ఇలా రాయాల్సి వచ్చిందా అని అడిగారు.
జగన్ పరిపాలనలో దేవుడికి రక్షణ కరువు అని రాస్తారా అని ఆయన మండిపడ్డారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా యజ్ఞయాగాదులు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. చంద్రబాబు పాలన అంటేనే అరిష్టమని, కరువు విలయతాండవం చేస్తుందని ఆయన దెప్పి పొడిచారు. దేవాదాయ శాఖకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే తనను అడగాలని, తాను చెప్తానని ఆయన అన్నారు.