మీరేమో బిజినెస్‌లు, సినిమాలు ఆపరు.. ప్రజలు మాత్రం నిరసనలు చేపట్టాలా..?
చంద్రబాబు అరెస్టయి జైల్లో కూర్చుని బాధపడుతుంటే బాలకృష్ణ ఏమో షూటింగులు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు ఆపరని, అలాగే చంద్రబాబు కుటుంబీకులు హెరిటేజ్ సంస్థను మూసివేయరని.. మరి ప్రజలు మాత్రం నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఏ విధంగా పిలుపునిస్తారని కారుమూరి ప్రశ్నించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు సిల్క్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు కూడా పాల్గొనాలని నారా లోకేష్ సహా ఇతర టీడీపీ నేతలు పిలుపునిస్తున్నారు. దీనిపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు చేశారు.
ఇవాళ విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కారుమూరి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కోసం ప్రజలు ఎందుకు రోడ్లమీదకు వచ్చి నిరసన తెలపాలని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టయి జైల్లో ఉంటే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగులు ఆపలేదన్నారు. బాలకృష్ణ నటించిన సినిమా విడుదలను కూడా నిలిపివేయలేదన్నారు. మరోవైపు చంద్రబాబు కుటుంబ సభ్యులు నడిపే హెరిటేజ్ సంస్థను కూడా మూయలేదని చెప్పారు. పైగా హెరిటేజ్ సంస్థకు లాభాలు వచ్చాయని ఇటీవల ఆ సంస్థ ప్రకటించిందని తెలిపారు.
చంద్రబాబు అరెస్టయి జైల్లో కూర్చుని బాధపడుతుంటే బాలకృష్ణ ఏమో షూటింగులు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు ఆపరని, అలాగే చంద్రబాబు కుటుంబీకులు హెరిటేజ్ సంస్థను మూసివేయరని.. మరి ప్రజలు మాత్రం నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఏ విధంగా పిలుపునిస్తారని కారుమూరి ప్రశ్నించారు.
చంద్రబాబు హయాంలో స్కామ్ లు జరిగాయని, ఆయన్ను అరెస్టు చేస్తే హైదరాబాద్‌లో గొడవలు చేయడం ఏమిటని మండిపడ్డారు. జైల్లో చంద్రబాబు కేజీ బరువు పెరిగితే, 5 కేజీల బరువు తగ్గారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా వ్యతిరేకత ఓటు చీలిపోకూడదనే టీడీపీతో చేతులు కలిపానని పదేపదే చెబుతున్నారని.. అసలు జగన్‌కు వ్యతిరేక ఓటు ఉంటే కదా చీలనివ్వనని పవన్ అనడానికి అని అన్నారు.