చంద్రబాబు ప్రజల్లో లేరు.. పచ్చమీడియాలోనే ఉన్నారు -కాకాణి
రాజధానుల విషయంలో కూడా జగన్ వికేంద్రీకరణను అమలు చేయాలని భావిస్తున్నారని, అసలు వికేంద్రీకరణకు అనుకూలమా, వ్యతిరేకమా అనే విషయంపై చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు మంత్రి కాకాణి.
ఇదేం ఖర్మ అంటూ చంద్రబాబు మొదలు పెట్టిన నిరసన కార్యక్రమంపై వైసీపీ నుంచి ఓ రేంజ్ లో కౌంటర్లు పడుతున్నాయి. అసలు చంద్రబాబుని చూసి ప్రజలు ఇదేం ఖర్మ అనుకుంటున్నారని మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. వైసీపీ పటిష్టంగా ఉందని టీడీపీ సమావేశంలోనే ఆ పార్టీ సర్వే సిబ్బంది చెప్పారని, దీంతో కార్యకర్తలు, నాయకులు ఇదేం ఖర్మ అనుకుంటున్నారని వెటకారం చేశారు. అందుకే అదే పేరుతో చంద్రబాబు ప్రజల్లో వెళ్తున్నారని చురకలంటించారు. చంద్రబాబుకు అల్జీమర్స్ ఉందని, దాంతోపాటు ఆయన మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని అన్నారు కాకాణి.
కర్నూలు పర్యటన తర్వాత చంద్రబాబు జబ్బలు చరుచుకుంటున్నారని, న్యాయ రాజధాని విషయంలో ఆయన ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని మండిపడ్డారు మంత్రి కాకాణి. చంద్రబాబును ప్రశ్నించే వారందరిపై వైసీపీ కార్యకర్తలు అనే ముద్ర వేయడం సరికాదని, పార్టీలతో సంబంధం లేని సాధారణ ప్రజలు, మేధావులు, ఉద్యోగులు.. కర్నూలులో చంద్రబాబుని నిలదీశారని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణ ఎలా ఉండాలో సీఎం జగన్ చేసి చూపిస్తున్నారని, సచివాలయ వ్యవస్థే దీనికి నిదర్శనం అని చెప్పారు కాకాణి. రాజధానుల విషయంలో కూడా జగన్ వికేంద్రీకరణను అమలు చేయాలని భావిస్తున్నారని, అసలు వికేంద్రీకరణకు అనుకూలమా, వ్యతిరేకమా అనే విషయంపై చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
పచ్చమీడియాలోనే బాబు ఉనికి..
తనపై ఉన్న అవినీతి కేసులపై స్టే తెప్పించుకునే క్రమంలో గతంలో సీబీఐ రాష్ట్రంలోకి రాకూడదని జీవో ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు అదే సీబీఐ విచారణ కావాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి కాకాణి. చంద్రబాబు చరిత్ర ఎప్పుడో ముగిసిపోయిందని, ఆయన ప్రజల్లో లేరని, కేవలం పచ్చ మీడియాలో మాత్రమే ఉన్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలకు పచ్చ కండువాలు వేసి అమరావతి పేరుతో పాదయాత్ర చేయిస్తున్నారని విమర్శించారు.