పూజకు పనికిరాని పువ్వు.. పవన్ పై మంత్రి జోగి సెటైర్లు
ఎన్ని తక్కువ సీట్లు తీసుకుంటే అంత ఎక్కువ ప్యాకేజీ పవన్ కల్యాణ్ కి వస్తుందని, అందుకే ఆయన 24 సీట్లకు పరిమితం అయ్యారన్నారు మంత్రి జోగి రమేష్.
పొత్తులో భాగంగా జనసేనకు కనీసం 60సీట్లయినా వస్తాయనుకున్నారని, చివరికి 50 సీట్లు కూడా లేకుండా చేశారని, 24కి మాత్రమే పరిమితం చేశారని.. 24 సీట్లతో పావలా కల్యాణ్ అనేది సార్థక నామధేయంగా మారిపోయిందని ఎద్దేవా చేశారు మంత్రి జోగి రమేష్. పవన్ అసలు రాజకీయాలకు పనికి రాడని, ఆయన పూజకు పనికి రాని పువ్వు అని కౌంటర్ ఇచ్చారు. జెండా సభ తర్వాత పవన్ కల్యాణ్ పరపతి మరింత తగ్గిపోయిందన్నారు.
అభిమానులే మక్కెలిరగదీస్తారు..
జెండా సభలో వైసీపీ నేతల మక్కెలిరగదీస్తామన్న కామెంట్ పై కూడా మంత్రి జోగి ఘాటుగా స్పందిస్తారు. పవన్ కల్యాణ్ బయట కనపడితే ఆయన అభిమానులే మక్కెలిరగదీస్తారని కౌంటర్ ఇచ్చారు. పార్టీని, నమ్ముకున్నోళ్లని, ప్రజల్ని నట్టేటి ముంచేసి పవన్ ఒక్కరే లాభపడ్డారని, చంద్రబాబుతో లాలూచీ పడ్డారని అన్నారు. పవన్ కల్యాణ్ ని ఓడించడానికి జనసైనికులే రెడీగా ఉన్నారని చెప్పారు.
అందుకే ప్యాకేజీ..
ఎన్ని తక్కువ సీట్లు తీసుకుంటే అంత ఎక్కువ ప్యాకేజీ పవన్ కల్యాణ్ కి వస్తుందని, అందుకే ఆయన 24 సీట్లకు పరిమితం అయ్యారన్నారు మంత్రి జోగి రమేష్. 175 సీట్లలో అభ్యర్ధుల్ని పెట్టుకోలేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఆయన చెప్పేవన్నీ పనికి మాలిన మాటలేనన్నారు. అభ్యర్థుల్ని ప్రకటించడానికే వైరి వర్గం ఆపసోపాలు పడుతోందని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి, ప్రచారం కూడా మొదలు పెట్టి ఎన్నికలకు పూర్తిగా సిద్దమైందని చెప్పారు మంత్రి జోగి రమేష్.