Telugu Global
Andhra Pradesh

బాలయ్య బాబు కాదు, బాలయ్య తాత.. గుడివాడ వెటకారం

బాలయ్యకు 60 ఏళ్లు దాటాయని.. బాలయ్య తాతను చూడటానికి ఇంకా ఎవరు థియేటర్లకొస్తారని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

బాలయ్య బాబు కాదు, బాలయ్య తాత.. గుడివాడ వెటకారం
X

వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో నిన్నంతా జై బాలయ్య, జైజై బాలయ్య అనే నినాదాలు సోషల్ మీడియాలో వినిపించాయి. అదే సమయంలో ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు వ్యవహారాన్ని గుర్తు చేసేలా వీరసింహారెడ్డి సినిమా ట్రైలర్ లో ఉన్న పంచ్ డైలాగులు కూడా టాక్ ఆఫ్ ఏపీగా మారాయి. వైసీపీనుంచి ఇంకా కౌంటర్లు పడలేదేంటా అనుకుంటున్న సమయంలో.. పంచ్ డైలాగుల జోలికి వెళ్లకుండా బాలయ్యపై పంచ్ లు విసిరారు మంత్రి గుడివాడ అమర్నాథ్.

బాలయ్య తాత..

నందమూరి బాలకృష్ణను బాలయ్యబాబు అని ముద్దుగా పిలుస్తారు చాలామంది. వయసు పైబడినా అభిమానులకు ఆయన ఇంకా బాలయ్య బాబే. అయితే ఆయన బాలయ్య బాబు కాదని, బాలయ్య తాత అంటూ వెటకారం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. బాలయ్యకు 60 ఏళ్లు దాటాయని.. బాలయ్య తాతను చూడటానికి ఇంకా ఎవరు థియేటర్లకొస్తారని ఎద్దేవా చేశారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాప్..!

ఒంగోలులో జరిగిన వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ ఫ్లాప్ అయిందని, అనుకున్నంత జనం రాలేదని అన్నారు మంత్రి అమర్నాథ్. బాలయ్య ఇప్పుడు సమరసింహారెడ్డి కాదని, ఆయన వీరసింహారెడ్డి అని, ఆయన పని అయిపోయిందని అన్నారు. జనాలు లేకే చంద్రబాబు, బాలయ్య బాబు రోడ్లపై మీటింగ్‌ లు పెట్టుకుంటున్నారని చురకలంటించారు. కాయగూరలు కొనడానికి, పల్లీలు కొనడానికి వచ్చిన వాళ్ళతో మీటింగ్‌ లు పెట్టి జనాన్ని చంపాలని చూస్తున్నారని విమర్శలు చేశారు.

విశాఖ రాజధాని ఎప్పుడంటే..?

విశాఖ నుంచి రాజధాని కార్యకలాపాలు ప్రారంభమయ్యే సమయం దగ్గర పడిందని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎలాంటి బిల్లు పెట్టకుండా వైజాగ్ నుంచి పాలన మొదలు కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం తర్వాత ఎప్పుడైనా విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందన్నారు. అయితే అధికారిక సమాచారం మాత్రం ఎవరి దగ్గరా లేదు.

First Published:  7 Jan 2023 3:14 PM GMT
Next Story