చంద్రబాబుని దేశం నుంచి బహిష్కరించాలి - మంత్రి అమర్నాథ్
ఒకరోజు పవన్ కల్యాణ్ తో, మరో రోజు బీజేపీతో ఉంటానని చెబుతున్న చంద్రబాబుకి భర్తలను మార్చే అలవాటు ఉందని, అందుకే పార్టీలను మార్చడం కూడా ఆయనకు అలవాటైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ నుంచి పారిపోయి ఏపీకి వచ్చిన చంద్రబాబుకి ఏపీలోనే కాదు, అసలు దేశంలోనే నివసించే అర్హత లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆయనకు దేశ బహిష్కరణ శిక్ష విధించాలన్నారు. రాష్ట్ర విభజనకు టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని చెప్పారు అమర్నాథ్. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి టీడీపీలో అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పడం దారుణం అని అన్నారాయన. శాంతి భద్రతలు అతిక్రమించిన చంద్రబాబు, లోకేష్ ని ముందు అరెస్ట్ చెయ్యాలని చెప్పారు.
అది బ్లాక్ డే..
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజుని చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటున్నారని, కానీ సెప్టెంబర్-1 చరిత్రలో బ్లాక్ డే అని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన ఆ రోజుని టీడీపీ అభిమానులెవరూ మరచిపోరని చెప్పారు. 1994లో ఎన్టీఆర్ ని చూసి ప్రజలు 200 సీట్లు ఇచ్చారు కానీ, చంద్రబాబును చూసి కాదని అన్నారు. చంద్రబాబుతో పాటు యనమల రామకృష్ణుడు కూడా పార్టీకి, ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. యనమల ఒక సెల్ఫ్ మేడ్ మేధావి అని ఎద్దేవా చేశారు అమర్నాథ్.
బాబుకి పొత్తులు కొత్త కాదు..
చంద్రబాబు కు పొత్తులు కొత్త కాదని, బీజేపీ పిలుస్తుందని చంద్రబాబు తనకు తానే చాటింపు వేసుకుంటున్నాడని, ఆ మాట బీజేపీ చెప్పాలని అన్నారు. ఒకరోజు పవన్ కల్యాణ్ తో, మరో రోజు బీజేపీతో ఉంటానని చెబుతున్న చంద్రబాబుకి భర్తలను మార్చే అలవాటు ఉందని, అందుకే పార్టీలను మార్చడం కూడా ఆయనకు అలవాటైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ కలయికతో చంద్రబాబు, లోకేష్ భయపడి పోతున్నారని చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ వారసునిగా తెలంగాణాలో బీజేపీ అవసరాల కోసం జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా మాట్లాడి ఉంటారని, వారిద్దరి కలయిక ప్రభావం ఏపీ రాజకీయాలపై ఏమాత్రం ఉండదని చెప్పారు మంత్రి అమర్నాథ్.