జగన్ సమావేశానికి రాకుండా ధర్మాన ఏం చేశారంటే..?
సీఎం మీటింగ్ కి డుమ్మా కొట్టిన ధర్మాన.. ఆసరా చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. అక్కడ కూడా ఏదో చెప్పాలనుకుని, ఇంకేదో చెప్పి పొదుపు గ్రూపు మహిళలకు మరోసారి టార్గెట్ అయ్యారు.
ఎమ్మెల్యేలు, ఇన్ చార్జ్ లు, కోఆర్డినేటర్లతో సీఎం జగన్ పెట్టిన సమావేశానికి మంత్రి ధర్మాన డుమ్మా కొట్టారు. ఆయన ముందుగానే పర్మిష్ తీసుకున్నారని వైసీపీ వర్గాలు వివరణ ఇచ్చాయి. జగనన్న ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధర్మాన, శ్రీకాకుళంలోనే ఉండిపోయారని అన్నారు. తీరా అక్కడ ధర్మాన చేసిన పని.. పార్టీని వేలెత్తి చూపించేలా ఉంది.
ఇటీవల రాజధాని వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు, తాజాగా లబ్ధిదారులకు చేసే హితబోధ కూడా వివాదాస్పదంగానే మారింది. మొగుళ్లు మందుకోసం డబ్బులు వృథా చేస్తుంటారని, ఆడవాళ్లు వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటు వేయకపోతే తమ చేయిని తామే నరుక్కున్నట్టని ఆమధ్య ఓ మీటింగ్ లో సెలవిచ్చారు ధర్మాన. తాజాగా శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలులో జరిగిన ఆసరా చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఆయన మరోసారి కలకలం రేపారు. మహిళలు జగన్ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో చెప్పారు. దానికి కౌంటర్ కూడా ఇచ్చారు.
సంస్కారం ఉండక్కర్లా..?
ఆసరా డబ్బులు జగన్ ఇంట్లోనుంచి ఇస్తున్నాడా అని ఇటీవల మీటింగ్ తర్వాత ఓ మహిళ అంటోందని, తిన్నది తిరగబోసుకోవడం అంటే ఇదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ధర్మాన. సంస్కారం లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. పద్దుకు మాలిన వ్యక్తుల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరగడానికి, సీఎం జగన్ కి సంబంధం లేదన్నారు. ధరలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెరుగుతున్నాయని సర్దిచెప్పారు. జగన్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ, ప్రేమను తగ్గించేందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని అన్నారు ధర్మాన.
మొత్తానికి సీఎం మీటింగ్ కి డుమ్మా కొట్టిన ధర్మాన.. ఆసరా చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. అక్కడ కూడా ఏదో చెప్పాలనుకుని, ఇంకేదో చెప్పి పొదుపు గ్రూపు మహిళలకు మరోసారి టార్గెట్ అయ్యారు. మహిళలు ఇలా మాట్లాడుకోవడం తప్పు అని చెప్పే క్రమంలో, సంస్కారంలేని వాళ్లు అని ధర్మాన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.