వాలంటీర్లు వర్సెస్ వైసీపీ నేతలు.. తెగేదాకా లాగుతున్నారా..?
వాలంటీర్లు ఉంటే ఉండండి, లేకపోతే పొండి, పనిచేయడం ఇష్టం లేకపోతే మిమ్మల్ని మేమే తీసిపారేస్తామంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు.
వాలంటీర్లు బచ్చాగాళ్లంటూ గతంలో ఒక నేత వ్యాఖ్యానించారు, వాలంటీర్లు మీ చేతిలో మనుషులే కదా ఇష్టం ఉంటే ఉంచండి, లేకపోతే పీకిపారేయండి అని అన్నారు ఇంకొకరు. వాలంటీర్లు మన కార్యకర్తలే కదా అంటారు ఇంకొకరు. తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా వాలంటీర్లు ఉంటే ఉండండి, లేకపోతే పొండి, పనిచేయడం ఇష్టం లేకపోతే మిమ్మల్ని మేమే తీసిపారేస్తామంటూ హెచ్చరించారు.
మరీ అంత అలుసైపోయారా..?
ఉంటే ఉండండి, లేకపోతే పొండి.. సహజంగా రెబల్ నేతలపై అధిష్టానం పేల్చే డైలాగులివి. కానీ ఇక్కడ పార్టీ కార్యకర్తల్లాగే వాలంటీర్లను కూడా ఉంటే ఉండండి పోతే పొండి అనడం సబబేనా. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో వాలంటీర్లు తమకి ఇచ్చే గౌరవ పారితోషికం కంటే ఎక్కువగానే కష్టపడుతున్నారనే వాదన ఉంది. ఇటు సచివాలయ సిబ్బందికి, అటు రెవెన్యూ సిబ్బందికి కూడా వారు ఇచ్చే నివేదికలే ఆధారం. సామాజిక పింఛన్ల పంపిణీలో వాలంటీర్లదే ప్రముఖ పాత్ర. వాలంటీర్లతో సమర్థంగా పనిచేయించుకోవడాన్ని ఎవరూ తప్పుపట్టరు. ఈ క్రమంలో కొంతమంది నేతల భాష అభ్యంతరకరంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
50 కుటుంబాలకు కూడా సేవ చేయలేని వాలంటీర్లు తమకు అవసరం లేదని అంటున్నారు మంత్రి ధర్మాన. వాలంటీర్లకు కిరీటం పెట్టే పని ప్రభుత్వం చేస్తోంటే.. వారిలో కొందరు తమ కింద ఎసరు పెట్టే పని చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్ పని కష్టం అనుకుంటే స్వచ్ఛందంగా తప్పుకోవాలని, లేకపోతే తామే తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. పనిచేయాలనుకునే వాలంటీర్లు తప్పనిసరిగా 50 కుటుంబాల బాధ్యత తీసుకోవాలన్నారు ధర్మాన.