రాజీనామా చేస్తానని సీఎంను కలిసిన ధర్మాన
మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, అందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరారు. పరిపాలన రాజధానిగా విశాఖ సాధన ఉద్యమానికి నాయకత్వం వహించాలనుకుంటున్నానని ఆ అవకాశం తనకు ఇవ్వాలని ధర్మాన కోరారు.
మూడు రాజధానుల విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరాంధ్ర ప్రయోజనాల కోసం సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా చేసేందుకు సిద్ధమని ఇది వరకే ఆయన ప్రకటించారు. అయితే ధర్మాన రాజీనామా కేవలం నాటకమని దమ్ముంటే ముందు మంత్రి పదవికి రాజీనామా చేయాలని వామపక్షాలు టీడీపీ ఎదురుదాడి చేశాయి.
ఈ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, అందుకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరారు. పరిపాలన రాజధానిగా విశాఖ సాధన ఉద్యమానికి నాయకత్వం వహించాలనుకుంటున్నానని ఆ అవకాశం తనకు ఇవ్వాలని ధర్మాన కోరారు. ప్రాంత ప్రయోజనాల కన్నా తనకు మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు. ఉత్తరాంధ్ర ఉద్యమం శక్తివంతంగా నడిచేందుకు తన రాజీనామా ఉపయోగపడుతుందని సీఎంకు వివరించారు.
అయితే ధర్మాన ప్రతిపాదనను సీఎం జగన్ తిరస్కరించారు. తొందరపాటు వద్దని వారించారు. అన్ని ప్రాంతాలకు సమంగా అభివృద్ధిని పంచాలన్నదే ప్రభుత్వం ఉద్దేశమని, విశాఖను రాజధానిగా చేస్తామని.. అందుకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.