మళ్లీ ఏపీ విభజనా..?
విశాఖ వేదికగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని.. అలా చేయని పక్షంలో విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీలో రాజకీయ ప్రయోగాలు వికటించి అంతిమంగా మరోసారి రాష్ట్ర విభజన దిశగా అడుగులు పడే ప్రమాదం కనిపిస్తోంది. ఏపీ సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు నోట ప్రత్యేక రాష్ట్రం మాట వచ్చేసింది. విశాఖ వేదికగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని.. అలా చేయని పక్షంలో విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయం మొత్తం తీసుకెళ్లి హైదరాబాద్‌లో పోశామని.. అభివృద్ధి చూసి అక్కడి వారికి కన్నుకుట్టిందని, దాంతో పంపించేశారని, కిమ్మనకుండా వచ్చేశామన్నారు. ఇప్పుడు అమరావతిలో రాజధానిని అభివృద్ధి చేస్తే అదే జరగదన్న గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు.
అప్పుడు ఉత్తరాంధ్ర పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. అందుకే రాజధానిగా అమరావతే ఉండాలంటే విశాఖ కేంద్రంగా రాష్ట్ర ఏర్పాటు జరగాలి.. పొద్దునే చద్దన్నం తిని రాజధాని విశాఖలో పనిచేసుకుని, మళ్లీ ఇంటికి రాగలుగుతాం అంటూ ధర్మాన వ్యాఖ్యలు చేశారు. మరోసారి విభజన జరగకూడదంటే విశాఖ రాజధాని కావాల్సిందేనన్నారు. కొద్ది రోజుల క్రితం ధర్మాన ప్రసాద రావే.. మంత్రి పదవికి రాజీనామా చేసి విశాఖ రాజధాని కోసం ఉద్యమిస్తానని అందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎంను కోరారు. సీఎం సున్నితంగా తిరస్కరించారు.
ఆ తర్వాత ఇదే ధర్మాన ప్రసాదరావు కర్నూలు న్యాయరాజధాని అంటున్నారు గానీ.. నిజమైన రాజధాని విశాఖలో ఏర్పాటు అయ్యేది అంటూ మాట్లాడి వైసీపీని ఇరుకునపెట్టారు. ఇప్పుడు ఏకంగా ఆయన రాష్ట్ర విభజన డిమాండ్ కూడా తెరపైకి తెచ్చారు. జగన్ మూడు రాజధానులు, చంద్రబాబు అమరావతి మధ్య జరుగుతున్న ఈ రాజకీయ పోరు అంతిమంగా ఎటు దారి తీస్తుందో చూడాలి.