Telugu Global
Andhra Pradesh

ఇబ్బంది లేదు.. రాదు- బుగ్గన హామీ

విభజన నాటికి ఏపీ అప్పు లక్షా 20వేల కోట్లుగా ఉంటే.. టీడీపీ ఐదేళ్ల కాలంలో కొత్తగా 2.69 లక్షల కోట్లు అప్పు చేశారని గణాంకాలను బుగ్గన వివరించారు.

ఇబ్బంది లేదు.. రాదు- బుగ్గన హామీ
X

ఏపీ ఆర్థిక పరిస్థితిపై నిత్యం మీడియా, టీడీపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మరోసారి వివరణ ఇచ్చారు. ముఖ్యంగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేస్తున్న ప్రచారాన్ని బుగ్గన ఖండించారు.

ప్రతిపక్షాలు, యనమల రామకృష్ణుడు పూటకో మాట మాట్లాడుతున్నారని బుగ్గన విమర్శించారు. తొలుత 8 లక్షల కోట్లు అప్పు అంటూ ప్రచారం చేశారని.. తాము వివరాలు వెల్లడించాక 6.38 లక్షల కోట్లు అప్పు అంటున్నారని గుర్తు చేశారు. అసలు టీడీపీ చేసిన అప్పుల కారణంగానే నేడు ప్రభుత్వం అధిక భారం మోయాల్సి వస్తోందన్నారు.

విభజన నాటికి ఏపీ అప్పు లక్షా 20వేల కోట్లుగా ఉంటే.. టీడీపీ ఐదేళ్ల కాలంలో కొత్తగా 2.69 లక్షల కోట్లు అప్పు చేశారని గణాంకాలను బుగ్గన వివరించారు. 58ఏళ్లలో చేసిన అప్పు కంటే అధికంగా ఐదేళ్లలో చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం 40వేల కోట్ల రూపాయల పెండింగ్‌ బిల్లులు ఉంచి వెళ్తే వాటిని తమ ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. టీడీపీ చేసిన అప్పులకు భారీగా వడ్డీలు చెల్లిస్తున్నామన్నారు. ఈ సవాళ్లు ఉండగానే కరోనా వచ్చిందని.. ఆ సమయంలోనూ భారీగా ఖర్చు చేసి పేదలను ఆదుకున్నామన్నారు. ఇన్ని చేసినా తమ ప్రభుత్వం చేసిన అప్పు 3.82 లక్షల కోట్లు మాత్రమేనన్నారు.

టీడీపీ హయాంలో ఎఫ్‌ఆర్‌బీఎం లిమిట్‌ను 3 శాతంగా నిర్ణయిస్తే దాన్ని మించి నాలుగు శాతం మేర ఏటా అప్పులు తెచ్చారని బుగ్గన వివరించారు. కోవిడ్ నేపథ్యంలో ఎఫ్‌ఆర్బీఎం లిమిట్‌ 4.5 శాతానికి పెంచినా.. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పు 2.1 శాతమేనని బుగ్గన వివరించారు. ఇది టీడీపీకి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.

తమ ప్రభుత్వం 1.85 లక్షల కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేసిందని.. తమ ప్రభుత్వంలో ప్రతి ఖర్చుకూ వివరాలు ఉన్నాయని బుగ్గన కౌంటర్ ఇచ్చారు. కేవలం టీడీపీ హయాంలో పెరిగిన అప్పులు, జరిగిన తప్పుల కారణంగానే నేడు ఈ ప్రభుత్వం భారాన్ని మోయాల్సి వస్తోందన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితి భేష్‌గా ఉందని.. ఎలాంటి ఇబ్బంది లేదు.. రాదు అని బుగ్గన హామీ ఇచ్చారు.

First Published:  28 Dec 2022 9:01 AM IST
Next Story