బుగ్గన కవరింగ్ కష్టాలు.. చెన్నై స్టేట్ మెంట్ ఏంటంటే..?
మూడు రాజధానులకోసం ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లుని వెనక్కి తీసుకునే ఉద్దేశం తమకు లేదని చెన్నైలో స్పష్టం చేశారు మంత్రి బుగ్గన. శ్రీబాగ్ ఒడంబడిక నుంచి మొదలు పెట్టి, వైసీపీ హయాంలో జరిగిన అసెంబ్లీ తీర్మానం వరకు ఆయన సోదాహరణంగా వివరించారు.
విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల బెంగళూరు వెళ్లిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విశాఖే రాజధాని అంటూ ఇచ్చిన స్టేట్ మెంట్ పెద్ద దుమారం రేపింది. సజ్జల సహా ఇతర మంత్రులంతా ప్రెస్ మీట్లు పెట్టి మరీ మూడు రాజధానులే మా విధానం అంటూ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. పనిలో పనిగా ఎల్లో మీడియా దుష్ప్రచారం అంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు. అయితే ఈసారి అలాంటి దుష్ప్రచారాలకు తావులేకుండా క్లియర్ గా, క్లారిటీగా మూడు రాజధానులపై మాట్లాడారు మంత్రి బుగ్గన. చెన్నైలో జరిగిన ప్రచార కార్యక్రమంలో మరోసారి ఆయన ఏపీ రాజధానులు – ఓ అవగాహన అంటూ మూడు రాజధానులపై సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు.
అసెంబ్లీ బిల్లుని వెనక్కి తీసుకోం..
మూడు రాజధానులకోసం ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లుని వెనక్కి తీసుకునే ఉద్దేశం తమకు లేదని చెన్నైలో స్పష్టం చేశారు మంత్రి బుగ్గన. శ్రీబాగ్ ఒడంబడిక నుంచి మొదలు పెట్టి, వైసీపీ హయాంలో జరిగిన అసెంబ్లీ తీర్మానం వరకు ఆయన సోదాహరణంగా వివరించారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టినట్టుగానే, విశాఖ పరిపాలన రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయన్నారు బుగ్గన.
బెంగళూరులో అలా, చెన్నైలో ఇలా..
ఏపీకి మూడు రాజధానులంటూ అపోహలు ప్రచారంలో ఉన్నాయంటూ బెంగళూరులో చెప్పిన మంత్రి బుగ్గన, చెన్నైకి వచ్చేసరికి సర్దుకున్నారు. ఏపీకి మూడు రాజధానులున్నాయని చెప్పారు. విశాఖ, అమరావతి, కర్నూలు అంటూ పేర్లు కూడా చదివి వినిపించారు. ఇక గ్లోబల్ సమ్మిట్ కోసం వ్యాపారవేత్తలను ఆకర్షించేందుకే బెంగళూరు, చెన్నైలో రోడ్ షో నిర్వహించామని చెప్పారు బుగ్గన. పొడవాటి తీరప్రాంతం, నౌకాశ్రయాలు, చేపలు, రొయ్యల సాగు, మానవ వనరుల గురించి చెన్నైలో పారిశ్రామికవేత్తలకు వివరించామని అన్నారాయన.