రాయలసీమ గర్జనకు మద్దతివ్వని వారంతా సీమ ద్రోహులే..
2014 ఏపీ విభజనతో రాయలసీమ వందేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, తిరిగి అభివృద్ధి చెందాలంటే న్యాయరాజధాని కర్నూలుకు రావాల్సిందేనన్నారు మంత్రి బుగ్గన. సీమ గర్జనకు మద్దతివ్వనివారంతా సీమ ద్రోహులేనని చెప్పారు.

ఈనెల 5న కర్నూలులో జరిగే రాయలసీమ గర్జన సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. గర్జనకు రానివారంతా సీమ ద్రోహులేనంటూ శాపనార్థాలు పెట్టారు. జేఏసీ ఏర్పాటు చేసే రాయలసీమ గర్జన సభకు, రాయలసీమ జేఏసీకి వైసీపీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారాయన. రాయలసీమ చరిత్ర తెలిసిన పెద్ద నాయకులు కూడా జేఏసీ సభను విమర్శించడం దారుణమని అన్నారు. పెద్ద నాయకులు చిన్న తరహా ఆలోచనలు చేయొద్దని, అందరూ కలసి రావాలని పిలుపునిచ్చారు. సభకు రానివారంతా సీమ ద్రోహులేనని హెచ్చరించారు. హైకోర్టు రాయలసీమ హక్కు అని చెప్పారు.
ఉత్తరాంధ్ర గర్జనలాగే సీమ గర్జన..
ఉత్తరాంధ్ర గర్జన ఇప్పటికే విజయవంతమైందని, అలాగే రాయలసీమ గర్జన కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బుగ్గన. ఈనెల 5న కర్నూలులో రాయలసీమ గర్జన బహిరంగ సభను పెద్ద ఎత్తున నిర్వహించేలా వైసీపీ ప్రణాళిక సిద్ధం చేసింది. పేరు జేఏసీదే అయినా వైసీపీ ఈ సభకు అన్నీ సమకూరుస్తోంది. వ్యాపార సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విధ్యార్థి యువజన సంఘాలు ఈ గర్జనలో పాల్గొంటాయని చెప్పారు మంత్రి బుగ్గన.
నవ్యాంధ్ర ఏర్పాటయ్యాక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకే చోట రాజధాని, హైకోర్టు, హెల్త్ సిటీ, టూరిజం సిటీ ఏర్పాటు చేశారని, జగన్ సీఎం అయ్యాక విస్తృత అధ్యయనం చేసి, సంప్రదింపులు జరిపి అభివృద్ధి వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు బుగ్గన. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ నిర్ణయించారన్నారు. పాలన రాజధాని విశాఖలో, అమరావతిలో అసెంబ్లీ, న్యాయరాజధాని కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా అభివృద్ధి వికేంద్రీకరణను సమర్థించిందని చెప్పారు. రాయలసీమ గర్జనతో రాష్ట్రమంతటికీ ఒక మెసేజ్ పంపాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. టీడీపీ సహా అమరావతే ఏకైక రాజధాని అని చెబుతున్న పార్టీలన్నీ ఈ గర్జనతో అయినా కళ్లు తెరవాలని చెప్పారు. 2014 ఏపీ విభజనతో రాయలసీమ వందేళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, తిరిగి అభివృద్ధి చెందాలంటే న్యాయరాజధాని కర్నూలుకు రావాల్సిందేనన్నారు. గర్జనకు అన్ని పార్టీలు సహకరించాలని, అలా సహకరించనివారంతా రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటున్నట్టే లెక్క అని తేల్చి చెప్పారు.