Telugu Global
Andhra Pradesh

పాపం పవన్.. మూడ్ వచ్చినప్పుడే సభలు పెడతాడు

తనపై విమర్శలు చేయనిదే పవన్ లాంటి వారికి పొద్దుపోదని, ఆయన రాజకీయాల్లో ఉన్నారని తెలిసేది ఇలాంటి విమర్శల వల్లే అన్నారు.

పాపం పవన్.. మూడ్ వచ్చినప్పుడే సభలు పెడతాడు
X

పవన్ బీసీ సభ పెట్టారు, వైసీపీ నుంచి కౌంటర్లు పడ్డాయి. ఈరోజు కాపుల సభ పెట్టారు, ఈరోజు కూడా వైసీపీ కాపు వర్గం నుంచి ఘాటు రియాక్షన్లు వచ్చాయి. తాజాగా పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.


కనీసం ఆయన సొంత కులం పేరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. తాను ధైర్యంగా కాపు అని చెప్పుకుంటానని, ఆ కులం పేరుతోనే తనకు పదవులు వచ్చాయని, ఇందులో దాపరికం ఏముందని, తప్పేముందని ప్రశ్నించారు.

మూడ్ వచ్చినప్పుడు మాత్రమే..

రాజ్యాధికారం కోసం రెండు పార్టీలతో సంబంధాలు ఉన్నప్పటికీ.. నాయకత్వం జనసేనదేనని ప్రకటించే దమ్ము పవన్ కల్యాణ్‌ కి ఉందా అని ప్రశ్నించారు మంత్రి బొత్స. జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే తాపత్రయంతోనే ఆయనపై బురదజల్లే ఆలోచనలో పవన్ ఉన్నారని ఆరోపించారు.


పవన్ కల్యాణ్ ది కేవలం ఒక సెలబ్రిటీ పార్టీ అని, మూడ్ వచ్చినప్పుడు మాత్రమే ఆయన మాట్లాడుతుంటారని, ఆయన వైఖరి చూస్తుంటే జాలేస్తుందని చెప్పారు. నిర్దిష్టమైన లక్ష్యం లేకుండా నీతి, నిజాయితీ లేకుండా పవన్ ముప్పయ్యేళ్లు రాజకీయాలు చేసినా వేస్ట్ అని తేల్చి చెప్పారు.

తాను టాటా బిర్లాల మాదిరిగి ఎదిగిపోయానంటూ పవన్ అభాండాలు వేశారన్నారు బొత్స. తనకంటే ముందే కాపు కులం నుంచి చాలామంది మంత్రులు వచ్చారని, తాను వ్యక్తిగతంగా ఎంత అభివృద్ధి చెందానో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు.

గంటకో కులం అనే వ్యక్తి పవన్ కల్యాణ్ అని.. కులం, మతం అనేది సమాజంలో ఒక భాగమైపోయిందని అన్నారు. తాను కాపు కులంలో పుట్టి.. రాజకీయంగా ఎదిగానని ధైర్యంగా చెప్పుకుంటానన్నారు. తనపై విమర్శలు చేయనిదే పవన్ లాంటి వారికి పొద్దుపోదని, ఆయన రాజకీయాల్లో ఉన్నారని తెలిసేది ఇలాంటి విమర్శల వల్లే అన్నారు. టీడీపీతో భాగస్వామిగా ఉన్న సమయంలో.. బీసీలకు జరిగిన అన్యాయం పవన్ కి గుర్తు రాలేదా అని నిలదీశారు.

First Published:  12 March 2023 9:40 PM IST
Next Story