Telugu Global
Andhra Pradesh

చిన్నశ్రీనుకి వైసీపీలో పెద్ద సీను

జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రయారిటీతో ఇతర నేతలూ చిన్న శ్రీను చుట్టే తిరుగుతున్నారు. ఈ క్రమంలో మంత్రి బొత్స హవా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మామ, మేనల్లుడి మధ్య కూడా బాగా గ్యాప్ వచ్చిందని సమాచారం

చిన్నశ్రీనుకి వైసీపీలో పెద్ద సీను
X

మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడిగా రాజకీయాలకు పరిచయమైన చిన్న శ్రీను అలియాస్ మజ్జి శ్రీనివాసరావు ఇప్పుడు ఉత్తరాంధ్ర వైసీపీ కీలక నేత. చిన్న శ్రీనుకి వైసీపీలో చాలా పెద్ద సీను ఉంది. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీను చుట్టూనే నియోజకవర్గ రాజకీయాలు తిరుగుతున్నాయి. మంత్రిగా మామ బొత్స సత్యనారాయణ కనిపిస్తున్నా, నిర్ణయాధికారం మాత్రం మేనల్లుడు చిన్న శ్రీనుదే. వైసీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ పదవులు కట్టబెట్టడం ద్వారా చిన్న శ్రీనుకే తాము ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో వైసీపీ అధిష్టానం సంకేతాలు ఇచ్చింది.

సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షనేతగా ఉత్తరాంధ్రలో చేసిన పర్యటనలను విజయవంతం చేసే బాధ్య‌తలు చిన్నశ్రీను చూసేవారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా సభలు, సదస్సులు వెనక ఉండే శక్తి చిన్న శ్రీనే. జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రయారిటీతో ఇతర నేతలూ చిన్న శ్రీను చుట్టే తిరుగుతున్నారు. ఈ క్రమంలో మంత్రి బొత్స హవా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మామ, మేనల్లుడి మధ్య కూడా బాగా గ్యాప్ వచ్చిందని సమాచారం. వైసీపీలో బొత్స కుటుంబం, మజ్జి శ్రీను కుటుంబం వర్గాలుగా ఏర్పడడంతో విజయనగరం వైసీపీలో కాక రేగుతోంది. బొత్సకి జనంలో క్రేజ్ తగ్గడం, మజ్జి శ్రీనివాసరావు పవర్ సెంటర్ కావడంతో వైసీపీ అధిష్టానం కూడా చిన్నశ్రీనునే ఎంటర్ టైన్ చేస్తోంది. విజయనగరం జిల్లాలో ఉండే చిన్న శ్రీను హవా అటు శ్రీకాకుళం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లోనూ కొనసాగుతోంది. విశాఖలోనూ తనకంటూ ప్రత్యేకవర్గాన్ని తయారు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగుతారని, వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి కూడా అవుతారని ఆయన అనుచరులు ఇప్పటి నుంచే సంబరపడుతున్నారు.

First Published:  13 Dec 2022 4:55 PM IST
Next Story