ఇప్పుడు మార్చాల్సిన అవసరం లేదు.. ఏప్రిల్‌లో వెళ్తున్నాం..
ఏప్రిల్ నెలలో విశాఖకు వెళ్లిపోతున్నామని, కాబట్టి ఈ రెండు నెలల కోసం కమిషనరేట్ కార్యాలయాన్ని మరొక చోటకు మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
విశాఖకు పరిపాలన రాజధాని తరలించే విషయంలో ఏపీ మంత్రులు ధీమాగానే ఉన్నారు. మరో రెండు నెలల్లో విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పటికే చెప్పారు. తాజాగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు కీలకమైన సూచనలు చేశారు.
ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయం విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఉంది. దీన్ని విజయవాడ బస్టాండ్ సమీపంలోని భవంతిలోనికి మార్చాలని ఇటీవల అధికారులు నిర్ణయించారు. అదే విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణకు చెప్పి గ్రీన్ సిగ్నల్ తీసుకునేందుకు వెళ్లారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం అందుకు అంగీకరించలేదు. ఇప్పుడు మార్చడం ఏంటని ప్రశ్నించారు.
ఏప్రిల్ నెలలో విశాఖకు వెళ్లిపోతున్నామని, కాబట్టి ఈ రెండు నెలల కోసం కమిషనరేట్ కార్యాలయాన్ని మరొక చోటకు మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. విశాఖపట్టణానికి తరలివెళ్లే ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యాశాఖ కార్యాలయమే ముందుంటుందని అధికారులకు మంత్రి చెప్పారు. మంత్రి ఇంత స్పష్టంగా ఏప్రిల్ లో విశాఖపట్నం వెళ్ళిపోతున్నామని చెప్పడంతో అధికారులు కూడా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయాన్ని మరొక చోటకు మార్చే ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు.