Telugu Global
Andhra Pradesh

టీచర్లు అడిగితేనే ఆ పనిచేశాం.. వివాదం ఏమీ లేదు.. - మంత్రి బొత్స క్లారిటీ

ఉపాధ్యాయులు కోరుకుంటూనే వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాం. తాము ఉపాధ్యాయులమని ఇతర విధుల్లో తమను భాగస్వామ్యం చేయొద్దని వారు కోరారు.

టీచర్లు అడిగితేనే ఆ పనిచేశాం.. వివాదం ఏమీ లేదు.. - మంత్రి బొత్స క్లారిటీ
X

ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే ఈ నిర్ణయంపై టీచర్ల నుంచి ఎటువంటి స్పందన వచ్చిందో తెలియదు గానీ.. ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. ప్రభుత్వం నిర్ణయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాట్లాడుతూ.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉపాధ్యాయులు మరుగుదొడ్లు కడిగించేందుకు, ప్రభుత్వ లిక్కర్ దుకాణాల వద్ద కాపలా ఉంచేందుకు పనికొస్తారు గానీ.. ఎన్నికల విధులకు పనికిరారా..? అంటూ ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని భయం పట్టుకుందని, అందుకే తమకు అనుకూలమైన సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి నియమించుకొనేందుకు ఈ కుట్ర చేసిందని కూడా తెలుగుదేశం శ్రేణులు ఆరోపించాయి. కాగా, తాజాగా ఈ ఆరోపణలపై మంత్రి బొత్స స్పందించారు. 'ఉపాధ్యాయులు కోరుకుంటూనే వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాం. తాము ఉపాధ్యాయులమని ఇతర విధుల్లో తమను భాగస్వామ్యం చేయొద్దని వారు కోరారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదు.

గతంలో తెలుగుదేశం వాళ్లు.. టీచర్లను రాజకీయంగా, ఎన్నికల్లో వాడుకున్నారేమో.. కానీ, మాకు మాత్రం ఆ అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం. కచ్చితంగా వారితో చర్చిస్తాం. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు.' అంటూ బొత్స క్లారిటీ ఇచ్చారు. మరి బొత్స వ్యాఖ్యలపై టీచర్లు ఎలా స్పందిస్తారో.. వేచి చూడాలి.

First Published:  3 Dec 2022 6:33 PM IST
Next Story