Telugu Global
Andhra Pradesh

కూటమి ఓటమి అర్థమై.. బాబులో అసహనం.. - బొత్స ఎద్దేవా

పవన్‌ కల్యాణ్‌ ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే చాలనుకుంటున్నాడని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. తమది కుటుంబ పార్టీ అని చంద్రబాబు అంటున్నాడని, మరి చంద్రబాబుది కుటుంబ పార్టీ కాదా అని ఆయన ప్రశ్నించారు.

కూటమి ఓటమి అర్థమై.. బాబులో అసహనం.. - బొత్స ఎద్దేవా
X

ఏపీలో కూటమి ఓడిపోతుందని తెలిసి చంద్రబాబులో అసహనం పెరిగిపోతోందని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. చంద్రబాబులో ఒరిజినాలిటీ లేదు, వైసీపీ పథకాలను కాపీ కొడుతున్నాడని ఆయన విమర్శించారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయకుండా ఎన్నికల కమిషన్‌ ద్వారా చంద్రబాబు అడ్డుకుంటున్నాడని మండిపడ్డారు. పేదలకు పథకాలు అందకుండా చేసి రాక్షస ఆనందం పొందుతున్నాడన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పవన్‌ తాను గెలిస్తే చాలనుకుంటున్నాడు..

పవన్‌ కల్యాణ్‌ ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే చాలనుకుంటున్నాడని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. తమది కుటుంబ పార్టీ అని చంద్రబాబు అంటున్నాడని, మరి చంద్రబాబుది కుటుంబ పార్టీ కాదా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కుటుంబం తరఫున ఐదు మంది పోటీ చేస్తున్నారని ఆయన గుర్తుచేశారు.. రాష్ట్రం ఏమైనా చంద్రబాబుకు పోటీ చేయడానికి రాసి ఇచ్చారా అంటూ నిలదీశారు. ప్రతిపక్ష పార్టీ నేతలుగా తాము పోరాటాలు చేసి గెలుస్తున్నామని, లోకేష్‌ లాగా అడ్డదారిలో పదవులు పొందలేదని చెప్పారు.

ఒక శుంఠ సీఎం గురించి మాట్లాడినప్పుడు నేను ప్రధాని గురించి మాట్లాడితే తప్పేంటి?

తాను ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేయడాన్ని ప్రశ్నిస్తున్నారని, ప్రధానిని విమర్శించడానికి తన స్థాయి సరిపోదా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. లోకేష్‌ స్థాయి సీఎం జగన్‌ విమర్శించేందుకు సరిపోతుందా? అని నిలదీశారు. తాను ఎంపీగా చేశానని, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించానని ఆయన తెలిపారు. ఒక శుంఠ సీఎం గురించి మాట్లాడినప్పుడు నేను ప్రధాని గురించి మాట్లాడితే తప్పేంటి?.. అంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. తమ ముఖ్యమంత్రి టార్గెట్‌ 175కు 175 అని.. ఆ లక్ష్యం దిశగా తమ పార్టీ ముందుకెళుతోందని బొత్స స్పష్టం చేశారు.

First Published:  12 May 2024 1:35 AM GMT
Next Story