అమరావతి యాత్రకు చాప చుట్టేశారు..
విశాఖ రాజధాని సాధనపై త్వరలో రూట్ మ్యాప్ రెడీ చేస్తామని అన్నారు మంత్రి బొత్స. విశాఖను రాజధానిగా చేస్తేనే ఉత్తరాంధ్ర మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు.
ఇటీవల అమరావతి యాత్రలో పాల్గొంటున్న రైతుల్ని పోలీసులు ఐడెంటిటీ కార్డులు చూపించాలని అడిగారు. కార్డులు లేని వారంతా వెనక్కి తగ్గారు. 600మంది రైతుల్లో కేవలం 60మంది వద్దే ఆధారాలున్నాయి. దీంతో ఒక్కసారిగా యాత్ర ఆగిపోయింది. రైతులంతా లగేజీ తీసుకుని సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. అమరావతి యాత్ర కృత్రిమమైనదని, అందుకే వారంతా వెనక్కి తగ్గారని అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. యాత్రపై విద్వేషం రగిల్చే ప్రయత్నాలు చేస్తున్నారని, దాడులు చేస్తున్నారని, అందుకే విరామమిచ్చామని అంటున్నారు రైతులు. ఎవరి వాదన ఎలా ఉన్నా యాత్ర మాత్రం ఆగిపోయింది. ఇక యాత్రకు చాప చుట్టేసినట్టేనని, తిరిగి మొదలు కాదని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని చెప్పారు.
విశాఖ పరిపాలనా రాజధానిగా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష సాకారం అయినట్టేనని అన్నారు మంత్రి బొత్స. విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకొని త్వరలోనే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం భూ సేకరణ, నిర్వాసితుల పునరావాస పనులు, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భూసేకరణపై ఆయన విజయనగరంలో సమీక్ష నిర్వహించారు. నవంబర్ లో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నామని చెప్పారు బొత్స. కొన్ని కోర్టు వివాదాలు ఉన్నాయని.. అవి త్వరలోనే పరిష్కారమవుతాయని అన్నారు.
విశాఖ రాజధానికోసం రూట్ మ్యాప్..
విశాఖ రాజధాని సాధనపై త్వరలో రూట్ మ్యాప్ రెడీ చేస్తామని అన్నారు మంత్రి బొత్స. విశాఖను రాజధానిగా చేస్తేనే ఉత్తరాంధ్ర మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖ ఉద్యమానికి అందరూ కలసి వచ్చారని, విశాఖ గర్జన విజయవంతమైన తర్వాతే టీడీపీలో భయం మొదలైందని అన్నారు. అందుకే రైతుల పాదయాత్ర ఆగిపోయిందని చెప్పారు మంత్రి బొత్స.