పవన్‌వి గాలి మాటలు.. - మంత్రి బొత్స ఫైర్
వలంటీర్ల విధి విధానాలు పవన్‌కు తెలుసా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. మహిళలపై పవన్ అసభ్యకరంగా మాట్లాడటం కరెక్టేనా అని నిలదీశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాలి మాటలు మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్ వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందనే దుర్బుద్ధితోనే ఆ వ్యవస్థపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్, ఆయన పార్టనర్ మాత్రమే హైదరాబాద్‌లో ఉంటారని, ప్రజల డేటాను హైదరాబాద్‌లో ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని చెప్పారు. ఏ డేటా ఎక్కడ ఉందో పవన్ కళ్యాణ్‌కు తెలుసా అని ప్రశ్నించారు.
వలంటీర్లు వారి పరిధిలో ఉండే 50 ఇళ్ల బాధ్యత మాత్రమే చూస్తారని మంత్రి బొత్స చెప్పారు. గ్రామం మొత్తం బాధ్యత చూడరని చెప్పారు. వారి పరిధిలో ఉండే 50 ఇళ్లంటే.. వారి బంధువులో, అయినవారో, చుట్టుపక్కలవారో అవుతారని వివరించారు. అలాంటివారి విషయంలో అసభ్యకరంగా, అభ్యంతకరంగా నీచమైన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేయడం తగదన్నారు.
వలంటీర్ల విధి విధానాలు పవన్‌కు తెలుసా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. మహిళలపై పవన్ అసభ్యకరంగా మాట్లాడటం కరెక్టేనా అని నిలదీశారు. టీడీపీ హయాంలో సర్వే పేరుతో సమాచారం తీసుకుని ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించారని మంత్రి చెప్పారు. అప్పుడు తానే డీజీపీకి ఫిర్యాదు చేశానని గుర్తుచేశారు. చంద్రబాబు సన్నిహిత సింగపూర్ మంత్రిని తాజాగా అరెస్ట్ చేశారని, ఆ మంత్రినే తీసుకొచ్చి అమరావతిలో చంద్రబాబు అట్టహాసంగా ప్రచారం చేసుకున్నాడని గుర్తుచేశారు. సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం సరైనది కాదని ఆనాడే తాను చెప్పానన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలూ వలంటీర్ వ్యవస్థను అమలు చేయాలని చూస్తున్నాయని మంత్రి బొత్స చెప్పారు. వలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పవన్ ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఏ నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయో పవన్ కల్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు. నిఘా వర్గాలు ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే చూపించాలన్నారు.