Telugu Global
Andhra Pradesh

కూటమికి ఓటేస్తే.. స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేం

అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో సంక్షేమ పథకాల అమలు కోసం జరుగుతున్న చర్చలతో తనకు భయం వేసేదని బొత్స చెప్పారు. కానీ, ఆ తర్వాత సంక్షేమ పథకాల అమలు చూసి చాలా గర్వపడుతున్నానని ఆయన తెలిపారు.

కూటమికి ఓటేస్తే.. స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేం
X

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఓటు వేస్తే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ని అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చినట్టే అవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. అదే జరిగితే స్టీల్‌ ప్లాంట్‌ని ఏ విధంగానూ రక్షించలేమని ఆయన తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ని అమ్మేస్తామని కంకణం కట్టుకున్న బీజేపీతో టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. విశాఖపట్నంలో గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

విశాఖ అభివృద్ధికి వైఎస్సార్‌ కృషి..

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని బొత్స తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణతో పాటు ఇక్కడి పరిశ్రమలను ఆయన కాపాడారని బొత్స చెప్పారు. కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించారన్నారు. అందులో భాగంగానే ఫార్మా సిటీ, అచ్యుతాపురం సెజ్‌ తదితరాలు ఏర్పాటయ్యాయని తెలిపారు.

సంక్షేమ పథకాలపై చెబుతుంటే.. భయం వేసేది..

అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో సంక్షేమ పథకాల అమలు కోసం జరుగుతున్న చర్చలతో తనకు భయం వేసేదని బొత్స చెప్పారు. కానీ, ఆ తర్వాత సంక్షేమ పథకాల అమలు చూసి చాలా గర్వపడుతున్నానని ఆయన తెలిపారు. సీఎం జగన్‌ పాలనలో ప్రతి పేదవాడికీ న్యాయం జరిగిందన్నారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను సీఎం జగన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరని స్పష్టం చేశారు. విశాఖ అభివృద్ధి కోసం సీఎం వైఎస్‌ జగన్‌ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి బొత్స చెప్పారు.

First Published:  28 March 2024 9:10 AM IST
Next Story