అవును పవన్ కల్యాణ్ చెప్పింది నిజమే –అంబటి
సిద్ధాంతాలను పక్కనపెట్టి కమ్యూనిస్టులతో, బీజేపీతో పవన్ కలిశారని అన్నారు. ఇప్పుడే కాదు పవన్ ఎప్పటికీ ఫెయిల్యూర్ నాయకుడేనని విమర్శించారు మంత్రి అంబటి.
పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఫెయిలయ్యారనేది నూటికి నూరుపాళ్లు వాస్తవమేనని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కేవలం సినీ నటుడిగా మాత్రమే సక్సెస్ అయ్యారని, రాజకీయ నాయకుడిగా ఫెయిలయ్యారని చెప్పారు. అయితే ఇక్కడే అంబటి తన మార్క్ పంచ్ కూడా జోడించారు. పవన్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని అంటూనే, ఇకపై కూడా ఆయన సక్సెస్ కాలేరని శాపనార్థాలు పెట్టారు. పవన్ ఎప్పటికీ రాజకీయాల్ల సక్సెస్ చూడలేరని అన్నారు.
సిద్ధాంతాలు లేని నాయకుడు..
రాజకీయాల్లో ఎవరికైనా ఒక సిద్ధాంతం ఉంటుందని, కానీ పవన్ కి మాత్రం ఓ సిద్ధాంతం అంటూ లేదని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. సైద్ధాంతిక విధానమంటూ లేని పవన్ రాజకీయల్లో తన పాత్రను సరిగా పోషించలేకపోతున్నారని విమర్శించారు. విప్లవనేతగా పార్టీ పెట్టిన పవన్ తనని తాను చేగువేరా అని చెప్పుకుంటారని.. కానీ, సిద్ధాంతాలను పక్కనపెట్టి కమ్యూనిస్టులతో, బీజేపీతో కలిశారని అన్నారు. ఇప్పుడే కాదు పవన్ ఎప్పటికీ ఫెయిల్యూర్ నాయకుడేనని విమర్శించారు మంత్రి అంబటి.
బాబు సమర్థుడైతే 2018లోనే పోలవరం పూర్తయ్యేది..
చంద్రబాబు సమర్థుడైతే పోలవరం ప్రాజెక్ట్ ని 2018లోనే పూర్తి చేసి ఉండేవారు కదా అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. పోలవరం ప్రాజెక్ట్ సందర్శన పేరుతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారని, అభూత కల్పనలు సృష్టించి, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు నిర్వాకం వల్లే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని, అయినా సరే అన్ని అడ్డంకుల్ని అధిగమించి, ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనన్నారు. ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి చంద్రబాబుని కూడా పిలుస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ ఫలానా టైమ్ కి పూర్తవుతుందని తాము చంద్రబాబు లాగా డెడ్ లైన్లు పెట్టబోమని.. ఎప్పటికైనా సీఎం జగన్ చేతుల మీదుగానే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.