ఎక్కడ నెగ్గాలో తెలియదు.. ఎక్కడ తగ్గాలో తెలియదు
టీడీపీతో పొత్తు ద్వారా పవన్ లాభపడింది లేదు, పైగా ఇప్పుడు బీజేపీ కూడా కూటమిలో కలవడంతో ఆయన మరింత నష్టపోయారు.

గతంలో జనసేనకు టీడీపీ కేటాయించిన అసెంబ్లీ సీట్లు కేవలం 24. ఇప్పుడు బీజేపీ వచ్చి కూటమిలో చేరే సరికి అందులో మరో మూడు కోసుకు పోయాయి. 21 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే నికరంగా ఇప్పుడు జనసేన పోటీ చేస్తోంది. ఎంపీ స్థానాలు కూడా 3 నుంచి 2కి తగ్గాయి. అంటే ఇక్కడ కూడా లాసే. ఇలాంటి పరిస్థితుల్లో అసలు పవన్ కల్యాణ్ ని నాయకుడనుకోవాలా..? పార్టీ అధినేతగా భావించాలా..? ఈ విషయంలో వైసీపీ నుంచి ఓ రేంజ్ లో కౌంటర్లు పడుతున్నాయి. పవన్ కల్యాణ్ పై మరోసారి ట్విట్టర్ వేదికగా సెటైర్లు పేల్చారు మంత్రి అంబటి రాంబాబు.
ఎక్కడ నెగ్గాలో తెలియనోడు
— Ambati Rambabu (@AmbatiRambabu) March 12, 2024
ఎక్కడ తగ్గాలో అసలు తెలియనోడు@PawanKalyan
"ఎక్కడ నెగ్గాలో తెలియనోడు, ఎక్కడ తగ్గాలో అసలు తెలియనోడు.. పవన్ కల్యాణ్" అంటూ ట్వీట్ చేశారు మంత్రి అంబటి. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు నియోజకవర్గాలనుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ ఓటమిని ఇంకా గుర్తు చేస్తూ అంబటి రాంబాబు, పవన్ ని వెటకారం చేశారు. ఎక్కడ నెగ్గాలో తెలియని పవన్ ఇప్పుడు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసుకోలేకపోయారని అన్నారు. అసెంబ్లీ సీట్ల వ్యవహారంలో పవన్ కల్యాణ్ తగ్గకూడదని, ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని కాపులు అనుకుంటున్నారని.. అలాంటి పవన్, చంద్రబాబు దగ్గర పూర్తిగా తగ్గారని, ప్యాకేజీకి అమ్ముడుపోయారని అంబటి చాలాసార్లు బహిరంగ వేదికలపై చెప్పారు. ఎక్కడ తగ్గాలో అస్సలు తెలియనోడు అంటూ ఇప్పుడు ట్వీట్ ద్వారా అలాంటి కామెంటే చేశారు.
పవన్ మరింత పలుచన అయ్యారా..?
టీడీపీతో పొత్తు ద్వారా పవన్ లాభపడింది లేదు, పైగా ఇప్పుడు బీజేపీ కూడా కూటమిలో కలవడంతో ఆయన మరింత నష్టపోయారు. చంద్రబాబు తెలివిగా జనసేన సీట్లలో కోతపెట్టి బీజేపీని తృప్తిపరిచారు. దీంతో పవన్ ఇప్పుడు పూర్తిగా బకరా అయిపోయారు. బీజేపీ కూడా కూటమిలో ఉండాలంటూ పవన్ పట్టుబట్టడం చివరకు ఆయన సీట్లకే ఎసరు తెచ్చింది. దీంతో రాజకీయ వ్యూహాల్లో పవన్ పూర్తిగా ఫెయిల్యూర్ స్టార్ అనిపించుకుంటున్నారు.