Telugu Global
Andhra Pradesh

టీడీపీ నేతలకు మంత్రి అంబటి స్ట్రాంగ్‌ కౌంటర్‌

చంద్రబాబు మీద ప్రేమ ఉంటే అది వేరేలా వ్యక్తం చేసుకోవాలని, అంతేకానీ దాడులు చేస్తామంటే తాము చేతులు కట్టుకుని కూర్చోబోమని హెచ్చరించారు.

టీడీపీ నేతలకు మంత్రి అంబటి స్ట్రాంగ్‌ కౌంటర్‌
X

టీడీపీ నేతలకు మంత్రి అంబటి స్ట్రాంగ్‌ కౌంటర్‌

టీడీపీ నేతలకు మంత్రి అంబటి రాంబాబు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఖమ్మంలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన తనపై దాడికి యత్నించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై తాడేపల్లిలో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖమ్మంలో జరిగిన ఓ నిశ్చితార్థానికి తాను హాజరైతే అక్కడ టీడీపీవారు తనపై దాడికి యత్నించారని చెప్పారు. దాడికి యత్నించినవారంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారని ఆయన తెలిపారు.

ఆ కులోన్మాదులపై పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. డబ్బు మదంతో కొందరు ఉన్మాదులు పేట్రేగిపోతున్నారని, వీరికి తోడుగా కొన్ని ఛానళ్లు అంబటికి నిరసన సెగ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి అంబ‌టి అన్నారు. దాడులు చేస్తే చేతులు కట్టుకుని కూర్చోబోమని, ఉన్మాదులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

దాడికి యత్నించినవారిలో ఆరుగురిని అరెస్టు చేశామ‌ని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపిన‌ట్లు చెప్పారు. ఇలాంటి కులోన్మాదంతోనే వంగవీటి రంగాని హతమార్చారని, ముద్రగడ పద్మనాభం మీద కూడా దాడి చేశారని అంబటి గుర్తు చేశారు. ఇది ఎంత మాత్రం సహించరానిద‌ని, చంద్రబాబు మీద ప్రేమ ఉంటే అది వేరేలా వ్యక్తం చేసుకోవాలని, అంతేకానీ దాడులు చేస్తామంటే తాము చేతులు కట్టుకుని కూర్చోబోమని హెచ్చరించారు.

టీడీపీ నేతలకు దమ్ముంటే అలా చేయండి..

టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని పిటిషన్లు వేసినా న్యాయస్థానాల నిబంధనల మేరకు నడుచుకుంటామని మంత్రి చెప్పారు. ఆయన కదలికలను పసిగట్టాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. పెండ్యాల శ్రీనివాస్‌ని చంద్రబాబు దేశం దాటించారని, ఆయన్ని పిలిపించి సీఐడీకి అప్పగిస్తే చంద్రబాబుకు బెయిల్‌ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేసే పరిస్థితే లేదని, ఇక తెలంగాణ టీడీపీ అడ్డా అని ఎలా అంటారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. టీడీపీ వారికి దమ్ముంటే జైలు గోడలను బద్దలుకొట్టాలని స‌వాలు చేశారు.

అంతకుముందు ఖమ్మంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి మంత్రి అంబటి రాంబాబు హాజ‌రు కాగా, టీడీపీ నాయకులు ఓవరాక్షన్‌ చేశారు. మంత్రి అంబటిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కరల్రతో వెళ్లి ఆయ‌న‌తో దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో టీడీపీ నేత కేతినేని హరీష్‌తో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

First Published:  27 Oct 2023 7:12 PM IST
Next Story