గాలి కల్యాణ్ అంటూ ఘాటు విమర్శలు..
పవన్ రాజకీయాలకు పనికిరాడని, కొన్నిరోజులు పోతే సినిమాలకి కూడా పనికిరాడని ఎద్దేవా చేశారు. పవన్ ని ఇమిటేట్ చేస్తూ ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చారు మంత్రి అంబటి రాంబాబు.
పవన్ కల్యాణ్ కి మల్టిపుల్ పర్సనాల్టీ డిజార్టర్ ఉందని.. రాజకీయాల్లో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా ఆయనతో ఎవరూ ఎక్కువ రోజులు కలసి ఉండలేరని వెటకారం చేశారు మంత్రి అంబటి రాంబాబు. కనీసం తన పార్టీనుంచి గెలిచిన ఎమ్మెల్యేని కూడా తనతోపాటు ఉంచుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. జనసేనలో చేరి బయటకు వచ్చేసిన నాయకుల లిస్ట్ చదివి వినిపించారు. పవన్ ని దగ్గరగా చూస్తే ఎవరైనా ఉండలేరన్నారు. దూరంగా చూస్తుంటే మాత్రం మా నాయకుడు అది, ఇది అని చెప్పుకోవాల్సిందేనన్నారు అంబటి.
రాజకీయాల్లో ఎవరైనా పార్టీ పెట్టొచ్చని, కానీ నిలబడగలిగినవారే మొనగాడని అన్నారు మంత్రి అంబటి. జగన్ జీవిత చరిత్ర ఓసారి తెలుసుకోవాలని పవన్ కి సూచించారు. 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు ఎత్తుకెళ్తే, వెంట్రుకతో సమానంగా జగన్ భావించారని.. ఆయన పోరాటాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు. పవన్ తన జీవితంలో ఎప్పటికీ అసెంబ్లీకి వెళ్లలేరని శాపనార్థాలు పెట్టారు. విప్లవ నాయకుడిని అని చెప్పుకునే పవన్.. ఎక్కడ పోరాటం చేశారని, ఏ విప్లవంలో పాల్గొన్నారని ప్రశ్నించారు. పవన్ రాజకీయాలకు పనికిరాడని, కొన్నిరోజులు పోతే సినిమాలకి కూడా పనికిరాడని ఎద్దేవా చేశారు.
వాలంటీర్లు చేసే సేవ పవన్ కల్యాణ్ కి తెలియదన్నారు మంత్రి అంబటి. వాలంటీర్ల వల్ల సామాన్య ప్రజలకు మేలు జరుగుతోందని చెప్పారు. రాత్రికి వారాహి ఎక్కి ఆవేశంగా మాట్లాడి, తెల్లవారిన తర్వాత పార్టీ ఆఫీస్ లో అత్యంత మర్యాదగా మాట్లాడుతూ విభిన్న రకాలుగా పవన్ ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. వినాయకుడు ఎలుకను వాహనంగా పెట్టుకున్నాడని, సాక్షాత్తు అమ్మవారి పేరుని వాహనానికి పెట్టుకునేవారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో సంపాదన, దానికి కట్టే పన్నుల గురించి చెప్పాలని నిలదీశారు. అలా చెప్పలేకపోతే ఆయన ఎక్కే వాహనం వారాహి కాదని, వరాహి అనుకోవాల్సిందేనన్నారు అంబటి.
పవన్ కి తల్లిదండ్రులు కల్యాణ్ బాబు అనే పేరు పెడితే, ఆయన దాన్ని పవన్ కల్యాణ్ గా మార్చుకున్నారని, ఆయన గాలి కల్యాణ్ అని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు. ఆయన కామెడీని ప్రజలు ఎంజాయ్ చేయాలని అంతే కాని, ఆయన్ను పెద్ద సీరియస్ గా పట్టించుకోవద్దన్నారు. చెప్పులు పోవడం కాదు, ఆయనకు ముందు బుర్ర పోయిందని వెెటకారం చేశారు అంబటి.