కాలక్షేపం కోసమే పాదయాత్ర.. నారా లోకేష్‌పై అంబటి సెటైర్లు
లోకేష్ దొడ్డిదారిన మంత్రి అయ్యాడని, ఆయన కాలక్షేపం కోసమే ప్రస్తుతం పాదయాత్ర నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోతారని అంబటి చెప్పారు.
కాలక్షేపం కోసమే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. లోకేష్ ది యువగళం కాదని, యువ గరళం అని కొద్ది రోజుల తర్వాత ప్రజలకు అర్థం అవుతుందన్నారు. గుంటూరులో శనివారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. లోకేష్ తీరు చూస్తుంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఉందన్నారు. పాదయాత్రలో లోకేష్ ఉపన్యాసాలు హాస్యాస్పదంగా ఉన్నాయని, కనీసం అర్హత అనే పదం కూడా లోకేష్ స్పష్టంగా పలకలేక పోయారన్నారు.
లోకేష్ దొడ్డిదారిన మంత్రి అయ్యాడని, ఆయన కాలక్షేపం కోసమే ప్రస్తుతం పాదయాత్ర నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోతారని అంబటి చెప్పారు. లోకేష్ చిత్తశుద్ధి లేని పాదయాత్ర చేస్తున్నారని, అటువంటి పాదయాత్ర మంచిది కాదని సూచించారు. వారాహి వాహనాన్ని కూడా ఎవరూ ఆపలేరని లోకేష్ తన ప్రసంగంలో అన్నారని, ఈ ప్రస్తావన లోకేష్ ఎందుకు తెచ్చారు.. అంటే టీడీపీ, జనసేన మధ్య సెటిల్మెంట్ పూర్తయినట్లేనా..? అని అంబటి ప్రశ్నించారు. మీ ఇరు పార్టీల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో మొదట తేల్చుకోవాలని సూచించారు.
ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వాడే భాష విని రాష్ట్ర ప్రజలు చిదరించుకుంటున్నారన్నారు. పోలీసులను ఉద్దేశించి బూతులు మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షుడు మాట్లాడే తీరు ఇదేనా అని నిలదీశారు. యువగళం పాదయాత్రకు అనుకున్నంత స్థాయిలో ప్రజలు హాజరు కాలేదని, పార్టీ శ్రేణులు కూడా జనాన్ని సమీకరించలేక పోయారనే నిరాశ, నిస్పృహతోనే అచ్చెన్నాయుడు బూతులు మాట్లాడారని, ఆయన మాటలు టీడీపీ పతనానికి నాంది అని అంబటి అన్నారు.