నోట్ల సంగతి తేలితే గానీ సీట్ల సంగతి తేలదు.. - టీడీపీ–జనసేనపై మంత్రి అంబటి సెటైర్లు
ఎన్నికలు దగ్గరపడుతున్నప్పటికీ ఇప్పటికీ పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసేదీ తెలియని పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తారో మరోచోట నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు.
టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో సెటైర్లు పేల్చారు. పొత్తులో భాగంగా ఇరు పార్టీలు పోటీ చేసే సీట్ల విషయంలో క్లారిటీ కోసం ఆదివారం ఉండవల్లిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అయ్యారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. నోట్ల సంగతి తేలితే గానీ, వారి సీట్ల సంగతి తేలదని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు.
సత్తెనపల్లిలో ఆదివారం మంత్రి అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు దగ్గరపడుతున్నప్పటికీ ఇప్పటికీ పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసేదీ తెలియని పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తారో మరోచోట నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు. అది తేలేది కాదు.. మునిగేది కాదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ఇప్పటికే ఎన్నికలకు సిద్ధంగా ఉందని, త్వరలో యుద్ధం కూడా అయిపోబోతోందని మంత్రి చెప్పారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చేదాకా కూడా వారు సీట్ల గురించి తేల్చుకోలేరని మంత్రి ఎద్దేవా చేశారు.
చంద్రబాబు పవన్‌కల్యాణ్‌కి ఇచ్చేది ముష్టి మూడో, ముప్పయ్యో, ఇరవై ఐదో అంటూ మంత్రి అంబటి సెటైర్లు వేశారు. సీట్లేమో ముష్టిలా ఇస్తారు.. క్యాష్ మాత్రం బలంగా ఇస్తారంటూ మంత్రి విమర్శించారు. పవన్ కల్యాణ్ ని నమ్మిన వారు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టేనని ఆరోపించారు.