అది వారి శునకానందం - అంబటి
టీడీపీ, జనసేనకు చెందిన ఇద్దరు వ్యక్తులు తనను అభాసుపాలు చేయడానికి ప్రయత్నించారని, ముందే ఓ పథకం ప్రకారం ఎల్లో మీడియా ఛానళ్లు వారిని రెచ్చగొట్టి, కెమెరాలు సిద్ధం చేసి ఆ చిన్న గొడవను హైలైట్ చేశాయని అన్నారు.
దుష్ట చతుష్టయానికి ధన్యవాదాలు అని చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. వారి ప్రసార మాధ్యమాల్లో తనకోసం కొంత స్థలం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. వారి పత్రికలు, ఛానళ్లలో ఎప్పటికీ తనపై పాజిటివ్ వార్తలు వేయరని, నెగెటివ్ వార్తలే వేస్తున్నా తనకోసం టైమ్ కేటాయించినందుకు, స్పేస్ కేటాయించినందుకు మాత్రం ధన్యవాదాలు అంటున్నారు. అలాగయినా వారు శునకానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు..?
అసలేం జరిగింది..?
అంబటి రాంబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం గ్రామంలో గడప గడపకు కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి వారికి అందుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో అంబటి రాంబాబుకి ఓ ప్రాంతంలో నిరసన సెగ ఎదురైందని, మహిళలు ఆయనపై తిరగబడ్డారని వార్తలొచ్చాయి. కానీ అక్కడ జరిగింది వేరు అంటున్నారు అంబటి. రాజుపాలెం అనే గ్రామంలో పర్యటించి 375 ఇళ్లను సందర్శించానని అన్నారాయన. ఆ క్రమంలో నూతన రేషన్ కార్డులు, పింఛన్లు పంపిణీ చేసినట్టు చెప్పారు. అయితే టీడీపీ, జనసేనకు చెందిన ఇద్దరు వ్యక్తులు తనను అభాసుపాలు చేయడానికి ప్రయత్నించారని, ముందే ఓ పథకం ప్రకారం ఎల్లో మీడియా ఛానళ్లు వారిని రెచ్చగొట్టి, కెమెరాలు సిద్ధం చేసి ఆ చిన్న గొడవను హైలైట్ చేశాయని అన్నారు.
బెండు తీశారా..?
"అంబటికి చేదు అనుభవం, అంబటికి గడప గడపలో అవమానం, అంబటికి బెండు తీసిన జనం.." ఇలా రకరకాల వ్యాఖ్యానాలతో ఆయన కార్యక్రమంపై వార్తలొచ్చాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు అంబటి. తన సొంత నియోజకవర్గంలో తన బెండు ఎవరు తీస్తారని, చిత్తశుద్ధితో పాలన సాగిస్తుంటే బెండు తీసే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. అంబటి బెండు తీశారు అనే కథనాలు కొంతమందికి శునకానందం ఇస్తుంటాయని, అలాంటి వారి కోసమే ఎల్లో మీడియా ఈ కట్టు కథలు ప్రసారం చేసిందని చెప్పారు. ఈమేరకు ట్విట్టర్లో ఓ వీడియో విడుదల చేశారు మంత్రి అంబటి.