జనసేనకు కాపులు పెద్ద సంఖ్యలో గుడ్‌బై చెప్పనున్నారు
నీచ నికృష్ట రాజకీయాలు చేసే చంద్రబాబుతో జనసేన పొత్తు పెట్టుకోవడాన్ని కాపులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన చెప్పారు.
జనసేన పార్టీకి కాపులు పెద్ద సంఖ్యలో గుడ్‌బై చెప్పనున్నారని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్న తమ ఆకాంక్ష ఎప్పటికీ నెరవేరే అవకాశం లేకపోవడంతో ఇప్పటికే ఆ పార్టీ నేతలంతా వైసీపీలో చేరుతున్నారని ఆయన తెలిపారు. హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరారని గుర్తుచేశారు. త్వరలోనే ఇంకా భారీస్థాయిలో జనసేనకు గుడ్‌బై చెప్పనున్నారని వివరించారు. పవన్ కళ్యాణ్ తనను నమ్ముకున్న వారికోసం కాకుండా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికే పార్టీ పెట్టినట్లుగా ప్రతి ఒక్కరికీ అర్థమవుతోందని అంబటి రాంబాబు తెలిపారు. ఒంగోలులో శనివారం మంత్రి అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
నీచ నికృష్ట రాజకీయాలు చేసే చంద్రబాబుతో జనసేన పొత్తు పెట్టుకోవడాన్ని కాపులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన చెప్పారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో భీమిలి, దెందులూరు, రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలను చూసిన తర్వాత కాపులకు పూర్తి అవగాహన వచ్చిందన్నారు. ఈ నెల 10న జరిగే సిద్ధం నాలుగో సభతో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఖాళీ అయి శ్రీమత్ రామాయణ గోవిందో హరి.. అనే పరిస్థితి ఏర్పడుతుందని ఎద్దేవా చేశారు.
సీఎం వైఎస్ జగన్‌కు విశేష ప్రజాదరణ లభిస్తుంటే.. పోటీ సభలు అంటూ టీడీపీ, జనసేన సంయుక్తంగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభకు జనం రాక వెలవెలబోయిందని గుర్తుచేశారు. జనం అండతో జగనే మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారని మంత్రి అంబటి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీ జెండా ఎగరడం ఖాయమని, ఇప్పటికే జనసేనను నమ్ముకుని 24 సీట్లకే పార్టీ పరిమితం కావడంతో జీర్ణించుకోలేక అనేకమంది ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి చెప్పారు.