Telugu Global
Andhra Pradesh

నాకు అంత దౌర్భాగ్యం పట్టలేదు.. - లంచం వివాదంపై అంబటి

అసలు ఆ కుటుంబానికి పరిహారం వచ్చేలా చూసిందే తానని చెప్పారు. శవాల మీద పేలాలు ఏరుకోవాల్సిన అవసరం లేదని.. పేదల దగ్గరి నుంచి రెండు లక్షలు లంచం తీసుకోవాల్సిన దౌర్బాగ్యం తనకు పట్టలేదన్నారు.

నాకు అంత దౌర్భాగ్యం పట్టలేదు.. - లంచం వివాదంపై అంబటి
X

డ్రైనేజ్‌ శుభ్రం చేస్తూ గుంతలో పడి చనిపోయిన యువకుడి కుటుంబం నుంచి లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలను మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. అంతటి దౌర్భాగ్యం తనకు పట్టలేదన్నారు. అలాంటి పరిస్థితే తనకు ఉంటే మంత్రి పదవిని కూడా వదులుకునే వాడినన్నారు.

పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన గంగమ్మ, పర్లయ్య దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పర్లయ్య అనారోగ్యంతో ఇంటి వద్దే ఉంటున్నారు. వీరికి ఇల్లు లేకపోవడంతో సత్తెనపల్లిలో రోడ్డు పక్క గుడిసెలో ఉంటున్నారు. 17ఏళ్ల వీరి కుమారుడు అనిల్ స్థానికంగా హోటల్‌లో పనిచేసేవాడు. ఆగస్ట్ 20న‌ హోటల్‌లోని డ్రైనేజ్ గుంతలో మురుగు తొలగిస్తూ ప్రమాదశాత్తు అందులో పడి చనిపోయాడు.

దాంతో 20 రోజుల క్రితం సీఎం సహాయనిధి నుంచి 5 లక్షల రూపాయల చెక్ వచ్చింది. ఈ విషయాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త సాంబశివరావు ఫోన్ చేసి చెప్పడంతో తాము వెళ్లామని.. అయితే చెక్‌ ఇవ్వాలంటే అందులో రెండున్నర లక్షల రూపాయలు తనకు ఇవ్వాలంటూ సాంబశివరావు డిమాండ్ చేశారని గంగమ్మ, పర్లయ్య మీడియా ముందు ఆరోపించారు.

ఆ తర్వాత మంత్రి అంబటి రాంబాబు వద్దకు వెళ్లి తాము ఆ డబ్బుతో కూతురి పెళ్లి చేయాలనుకుంటున్నామని.. కాబట్టి ఐదు లక్షలు ఇచ్చేలా చూడాలని కోరగా... సగం డబ్బు చైర్‌పర్సన్ భర్తకు ఇవ్వాల్సిందేనని.. ఒకవేళ అతడికి అవసరం లేకపోతే తాను తీసుకుంటానని మంత్రి అంబటి రాంబాబు తమను గ‌ట్టిగా అరిచి పంపించారని వారు ఆరోపించారు. సీఐ దగ్గరకు వెళ్లగా మంత్రి చెప్పినట్టు వినాలని లేనిపక్షంలో స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుందని బెదిరించారని దంపతులు మీడియా సమావేశంలో ఆరోపించారు.

దాంతో టీడీపీ అనుకూల మీడియా సీఎం సహాయ నిధిలోనూ లంచాలు తీసుకుంటున్న మంత్రి అంబ‌టి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. అసలు ఆ కుటుంబానికి పరిహారం వచ్చేలా చూసిందే తానని చెప్పారు. శవాల మీద పేలాలు ఏరుకోవాల్సిన అవసరం లేదని.. పేదల దగ్గరి నుంచి రెండు లక్షలు లంచం తీసుకోవాల్సిన దౌర్బాగ్యం తనకు పట్టలేదన్నారు. తనను అవినీతి పరుడిగా చిత్రీకరించేందుకు జనసేన నేతలు, పవన్ కల్యాణ్ కలిసి ఈ కుట్రపూరితమైన ప్రచారం చేయిస్తున్నారని అంబటి ఆరోపించారు.

First Published:  20 Dec 2022 3:49 PM IST
Next Story